

వరుస పరాజయాలతో పాకిస్థాన్ క్రికెట్ తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. ఇటీవల ఇంగ్లాండ్ గడ్డపై జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో పాక్ జట్టు కనీస పోటీ ఇవ్వలేక వైట్‌వాష్‌కు గురైంది. తొలి రెండు టెస్టుల తర్వాత కోచింగ్ వ్యవస్థతో పాటు జట్టులో పలు మార్పులు చేసినప్పటికీ.. మూడో టెస్టులోనూ పరాజయం తప్పలేదు. దీనికి తోడు స్లో ఓవర్ రేట్ కారణంగా 11 పాయింట్ల కోత పడటంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో పాకిస్థాన్ అట్టడుగుకు చేరింది. ఈ పరిణామాలపై పీసీబీ చీఫ్ మోసిన్ నఖ్వీ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో పీసీబీలో భారీ ప్రక్షాళన చేపట్టేందుకు నఖ్వీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పలువురు కీలక అధికారులపై వేటు పడే అవకాశం ఉందని పీసీబీ వర్గాలు చెబుతున్నాయి. చీఫ్ సెలక్టర్ అకిబ్ జావేద్, మహిళల జట్టు హెడ్ కోచ్ వహాబ్ రియాజ్ పదవులు కూడా ప్రమాదంలో ఉన్నట్లు సమాచారం. ఆసియా క్రీడల అనంతరం వీరిద్దరినీ తప్పించే అవకాశముందని తెలుస్తోంది. కోచింగ్ సిబ్బందిలోనూ సమూల మార్పులు చేయాలని బోర్డు యోచిస్తోంది. గత రెండేళ్లలో కెప్టెన్లు, కోచింగ్ సిబ్బందిని తరచూ మార్చడం, జట్ల ఎంపికలో తీసుకున్న నిర్ణయాలపై అకిబ్ జావేద్ విమర్శలు ఎదుర్కొన్నారు. పాకిస్థాన్ మాజీ టెస్టు కోచ్ జేసన్ గిలెస్పీ సైతం ఇటీవల అకిబ్ పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. గతంలోనూ సెలక్షన్ కమిటీ, కెప్టెన్సీ, కోచింగ్ వ్యవస్థల్లో అనేక మార్పులు చేసినప్పటికీ పాక్ క్రికెట్ పరిస్థితిలో ఆశించిన మెరుగుదల కనిపించలేదు. ఈసారి జరిగే ప్రక్షాళనలో కొత్త మేనేజ్‌మెంట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందన్నదే కీలకంగా మారింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!