

ప్రయాణికులకు వేగవంతమైన సేవలు అందించేందుకు ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ ప్రయాణికుల సేవలను మరింత సులభతరం చేసేందుకు సేల్స్‌ఫోర్స్‌కు చెందిన ఏజెంట్‌ఫోర్స్ ఏఐ ప్లాట్‌ఫాంను వినియోగించనున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా రిఫండ్, టికెట్‌పై తప్పుగా నమోదైన ప్రయాణికుల పేర్ల సవరణ వంటి సేవలు ఇకపై వేగంగా పూర్తికానున్నాయి. కొత్త ఏఐ వ్యవస్థతో రిఫండ్ ప్రక్రియ సమయం 14 రోజుల నుంచి నాలుగు గంటలకు తగ్గనుంది. అలాగే టికెట్‌పై పేరును సవరించే ప్రక్రియ గతంలో మూడు రోజులు పట్టగా.. ఇకపై కేవలం 30 నిమిషాల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. ఒకే ఈ-మెయిల్‌లో ప్రయాణికుడు పలు సమస్యలను ప్రస్తావించినా.. ఏఐ వ్యవస్థ వాటన్నింటినీ గుర్తించి ఒకే సమాధానంలో పరిష్కరించనుంది.
మరోవైపు దిల్లీ విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఘటనపై ఎయిరిండియా అధికారుల నుంచి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వివరణ కోరింది. సెప్టెంబర్ 4న ముగ్గురు ఇటాలియన్ పౌరులు ఇమిగ్రేషన్ తనిఖీలు లేకుండానే దిల్లీ విమానాశ్రయం నుంచి దేశం విడిచి వెళ్లిన ఘటనను కేంద్రం తీవ్రంగా పరిగణించింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు ఎయిరిండియా ఉన్నతాధికారులు కర్తవ్య భవన్‌లో జరిగే సమావేశానికి హాజరు కావాలని ఆదేశించినట్లు సమాచారం. ఇప్పటికే పౌర విమానయాన శాఖ కూడా ఎయిరిండియాకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఇదిలా ఉండగా, టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ అధ్యక్షతన ముంబయిలో జరిగిన బోర్డు సమావేశంలో కొత్త ఎండీ, సీఈవో వేతనం సహా పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!