

టెక్సాస్ రైల్‌రోడ్ కమిషన్‌కు రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆ పార్టీ నేత బో ఫ్రెంచ్ చేసిన సోషల్ మీడియా పోస్టులు వివాదానికి దారితీశాయి. అమెరికాలోని భారతీయ, దక్షిణాసియా విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ విద్యార్థులు ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా సంబరాలు చేసుకుంటున్న ఫొటోను ఫ్రెంచ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ చిత్రాన్ని చూస్తే విదేశీయులు అమెరికన్ల స్థానాన్ని ఎలా ఆక్రమిస్తున్నారో అర్థమవుతోందని, పరిస్థితి తాను ఊహించిన దానికంటే ఎక్కువగా ఉందని వ్యాఖ్యానించారు. విదేశీయుల కారణంగా అమెరికన్లకు నష్టం జరుగుతోందనే భావన కలిగేలా ఆయన పోస్టులు పెట్టడం విమర్శలకు కారణమైంది.
అదే ఫొటోపై ఫ్రెంచ్ చేసిన మరో వ్యాఖ్య కూడా చర్చనీయాంశమైంది. అది యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి సంబంధించిన ఫొటో అని ఆయన పేర్కొన్నప్పటికీ.. వాస్తవానికి అది ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా తీసినదిగా తేలింది. ఫ్రెంచ్ వ్యాఖ్యలను సొంత పార్టీ నేతలే తీవ్రంగా ఖండించారు. సెనేటర్ జాన్ కార్నిన్ ఆయన వ్యాఖ్యలను ముమ్మాటికీ జాత్యహంకారంగా అభివర్ణించారు. డెమోక్రాట్ నేతలు కూడా ఫ్రెంచ్ తీరును తప్పుబట్టారు. భారతీయ సంతతికి చెందిన యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి సైతం ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ.. అమెరికాలో భారతీయులపై వివక్షకు వ్యతిరేకంగా నిలబడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దీంతో ఈ వ్యవహారం రిపబ్లికన్ పార్టీలోనూ చర్చకు దారితీసింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!