

దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ ప్రపంచ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన, దూకుడైన పేసర్లలో ఒకరిగా గుర్తింపు పొందాడు. వసీమ్ అక్రమ్, వకార్ యూనిస్, గ్లెన్ మెక్‌గ్రాత్, కర్ట్లీ ఆంబ్రోస్ వంటి దిగ్గజ పేసర్ల సరసన నిలిచే సామర్థ్యం స్టెయిన్‌కు ఉంది. దక్షిణాఫ్రికా తరఫున 93 టెస్టులు, 125 వన్డేలు, 47 టీ20లు ఆడిన ఆయన మొత్తం 699 వికెట్లు పడగొట్టాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాజీ క్రికెటర్ వెర్నాన్ ఫిలాండర్.. ఇప్పటికీ ఏ బ్యాటర్‌కు బౌలింగ్ చేయడానికి ఇష్టపడతారని స్టెయిన్‌ను ప్రశ్నించాడు.
దీనికి స్టెయిన్ స్పందిస్తూ.. పాకిస్థాన్ మాజీ బ్యాటర్ మహ్మద్ హఫీజ్‌కు బౌలింగ్ చేయడాన్ని ఎంచుకుంటానని చెప్పాడు. తన కెరీర్‌లో హఫీజ్‌ను 16 సార్లు ఔట్ చేశానని, అందుకే అతడి పేరును చెబుతున్నానని వెల్లడించాడు. ఇదే సందర్భంగా యువ భారత సంచలనం వైభవ్ సూర్యవంశీపై స్టెయిన్ ప్రశంసలు కురిపించాడు. వైభవ్ ప్రత్యేకమైన ఆటగాడని, భారత క్రికెట్‌కు అతడు అద్భుతమైన నిధి అని పేర్కొన్నాడు. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీలను తాను చూశానని.. వైభవ్ వారికంటే మరింత విధ్వంసకరమైన బ్యాటర్‌గా ఎదిగే సామర్థ్యం కలిగి ఉన్నాడని చెప్పాడు. అయితే అతడి ప్రతిభను సరైన విధంగా తీర్చిదిద్దడం, కెరీర్‌ను జాగ్రత్తగా నిర్వహించడం ఎంతో ముఖ్యమని స్టెయిన్ సూచించాడు. సరైన మేనేజ్‌మెంట్ లభిస్తే వైభవ్ భవిష్యత్తులో గొప్ప స్టార్‌గా ఎదుగుతాడని అభిప్రాయపడ్డాడు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!