

అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి టీ20లో యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో చోటు కల్పించకపోవడంపై మాజీ భారత క్రికెటర్ క్రిస్ శ్రీకాంత్ టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్‌పై విమర్శలు గుప్పించాడు. ఇటీవల జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన వైభవ్‌ను పక్కన పెట్టడంపై ఆయన ప్రశ్నలు లేవనెత్తాడు. ఇలాంటి ఎంపిక నిర్ణయాలు యువ ఆటగాడిలో అనిశ్చితిని పెంచుతాయని, తప్పుడు సంకేతాలను పంపే అవకాశం ఉందని పేర్కొన్నాడు. దేశవాళీ క్రికెట్, దులీప్ ట్రోఫీ, ఇండియా-ఏ, ఐపీఎల్ వంటి స్థాయిల్లో వైభవ్ నిలకడగా రాణించాడని గుర్తుచేస్తూ.. అతడిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని శ్రీకాంత్ చెప్పాడు.
సంజు శాంసన్ విషయంలోనూ టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్ వ్యవహరిస్తున్న తీరును శ్రీకాంత్ ప్రశ్నించాడు. సంజుకు వరుసగా మరిన్ని అవకాశాలు ఇవ్వాలని, ఒక్కటి రెండు మ్యాచ్‌ల ప్రదర్శన ఆధారంగా అతడిని పక్కన పెట్టకూడదని సూచించాడు. అదే సమయంలో వైభవ్ సూర్యవంశీకి కూడా వరుసగా కొన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశం కల్పించాలని పేర్కొన్నాడు. ఇద్దరిలో ఎవరినీ తుది జట్టులో స్థిరంగా కొనసాగించకపోవడం సరైన నిర్ణయం కాదని, ఇలాంటి మార్పులు ఏ ఆటగాడి ఆత్మవిశ్వాసంపైనైనా ప్రభావం చూపుతాయని శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!