

ప్రస్తుతం సినిమా బిజినెస్‌లో ఓటీటీ కీలక భాగంగా మారిపోయింది. గతంలో సినిమా బాక్సాఫీస్ ఫలితాలతో సంబంధం లేకుండా విడుదలకు ముందే స్ట్రీమింగ్ హక్కుల కోసం ఓటీటీ సంస్థలు డీల్స్ చేసుకునేవి. అయితే పెరుగుతున్న పోటీ, మారుతున్న మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో కొన్ని సంస్థలు ఇప్పుడు సినిమాల బాక్సాఫీస్ పనితీరును బట్టి చెల్లింపులు చేసేలా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. సుహాస్, సూరి కీలక పాత్రల్లో నటించిన ‘మండాడి’కి కూడా ఇలాంటి డీల్ జరిగినట్లు సమాచారం. దీంతో నిర్మాత ఎల్రెడ్ కుమార్‌కు ఈ ఒప్పందం భారీ ప్రయోజనాన్ని అందించే అవకాశం కనిపిస్తోంది.
దర్శకుడు మతిమారన్ పుగళేంది తెరకెక్కించిన ‘మండాడి’ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తమిళం, తెలుగులో విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి స్పందన అందుకుంటూ.. ఐదు రోజుల్లో రూ.65 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమా బడ్జెట్ సుమారు రూ.45 కోట్లు అని సినీ వర్గాల సమాచారం. స్ట్రీమింగ్ హక్కుల కోసం నిర్మాత రూ.25 కోట్లు కోరగా.. నెట్‌ఫ్లిక్స్ తొలుత రూ.15 కోట్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. చివరకు రూ.50 కోట్ల గ్రాస్ దాటితే రూ.30 కోట్లు, రూ.60 కోట్ల నుంచి రూ.80 కోట్ల వరకు వసూళ్లు సాధిస్తే రూ.40 కోట్లు చెల్లించేలా ఒప్పందం కుదిరినట్లు సమాచారం. ఇప్పటికే రూ.65 కోట్ల గ్రాస్ సాధించినట్లు చిత్రబృందం ప్రకటించడంతో నిర్మాతకు ఈ డీల్ మరింత లాభదాయకంగా మారింది. ఇదే జోరు కొనసాగితే రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరే అవకాశం కూడా ఉంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!