

జూనియర్ ఆసియాకప్ హాకీ టోర్నమెంట్‌లో ఇండోనేసియాపై 14-0తో ఘన విజయం సాధించిన భారత పురుషుల జట్టు.. ఆదివారం జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం తీవ్ర పోరును ఎదుర్కొంది. చివరి నిమిషంలో కెప్టెన్ అన్మోల్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచడంతో భారత్ 3-3తో డ్రా చేసుకుని ఓటమి నుంచి బయటపడింది. మ్యాచ్ నాలుగో నిమిషంలో అన్మోల్ పెనాల్టీ స్ట్రోక్‌తో భారత్‌కు తొలి గోల్ అందించగా.. 10వ నిమిషంలో అషు మౌర్య పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు. అయితే 11వ నిమిషంలో రయుషిన్ ససాకి గోల్‌తో జపాన్ ఖాతా తెరిచింది. అనంతరం రెండు జట్లు గోల్ కోసం తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. చివరి క్వార్టర్‌లో నకనిషి 48వ, 59వ నిమిషాల్లో గోల్స్ చేసి జపాన్‌ను 3-2 ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. మ్యాచ్ ముగియడానికి 59 సెకన్ల ముందు భారత్‌కు లభించిన పెనాల్టీ కార్నర్‌ను అన్మోల్ గోల్‌గా మలిచి స్కోరును సమం చేశాడు. భారత్ మంగళవారం కొరియాతో తలపడనుంది.
మరోవైపు మహిళల జూనియర్ ఆసియాకప్‌లో భారత జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం మలేసియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 11-1తో ఘన విజయం సాధించింది. తొలి నిమిషం నుంచే ఆధిపత్యం ప్రదర్శించిన భారత జట్టు.. మ్యాచ్ ముగిసే వరకు అదే దూకుడును కొనసాగించింది. పూజ సాహో, పూర్ణిమ యాదవ్, గీత యాదవ్, సనిక మానె రెండేసి గోల్స్ సాధించారు. బినిమా ధాన్, కృష్ణ శర్మ, సుఖ్‌వీర్ కౌర్ ఒక్కో గోల్ చేశారు. మలేసియా తరఫున 38వ నిమిషంలో నూర్ మహ్మద్ ఏకైక గోల్ సాధించింది. భారీ విజయంతో భారత మహిళల జట్టు టోర్నీలో తమ ఆధిపత్యాన్ని చాటుకుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!