

పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఎదుర్కొంటున్న వరుస వైఫల్యాలకు ఆ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ యూసుఫ్ ఆసక్తికర కారణాన్ని వెల్లడించాడు. 2021 టీ20 ప్రపంచకప్‌లో దుబాయ్ వేదికగా భారత్‌పై సాధించిన 10 వికెట్ల విజయం తర్వాతే పాక్ క్రికెట్ పతనం మొదలైందని ఆయన అభిప్రాయపడ్డాడు. ఆ మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన తర్వాత కొందరు ఆటగాళ్లు తాము ఏదో గొప్ప ఘనత సాధించినట్లు భావించారని, దాని ప్రభావం వారి ప్రవర్తనపై పడిందని యూసుఫ్ పేర్కొన్నాడు. మంచి ప్రదర్శన చేస్తున్న సమయంలో ఆటగాళ్లు వినయంగా ఉండాలని, అహంకారం, అగౌరవం జట్టులో సమస్యలకు దారితీస్తాయని సూచించాడు. ముఖ్యంగా కెప్టెన్సీ కోసం నెలకొన్న పోటీ డ్రెస్సింగ్ రూమ్‌లో విభేదాలను పెంచిందని తెలిపాడు.
2021 తర్వాత వన్డే, టీ20 ప్రపంచకప్‌లు, ఆసియా కప్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ వంటి ప్రధాన టోర్నీల్లో పాకిస్థాన్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిందని యూసుఫ్ గుర్తుచేశాడు. జట్టును గాడిలో పెట్టేందుకు పీసీబీ కెప్టెన్లు, కోచ్‌లు, సహాయక సిబ్బందిని పలుమార్లు మార్చినా పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదని, ఆటగాళ్లు బాధ్యత తీసుకోవడంలో విఫలమయ్యారని విమర్శించాడు. 2021 టీ20 ప్రపంచకప్‌లో భారత్ నిర్దేశించిన 152 పరుగుల లక్ష్యాన్ని పాకిస్థాన్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఛేదించింది. బాబర్ అజామ్ 68, మహ్మద్ రిజ్వాన్ 79 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్‌పై పాక్‌కు అదే తొలి విజయం. ఇదిలా ఉండగా, మహిళల క్రికెట్‌లోనూ భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. ఇటీవల ఆసియా కప్ గ్రూప్-ఎ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు పాకిస్థాన్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!