

ఈ నెల 15 న భారత్తో జరిగే టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను బహిష్కరించాలన్న నిర్ణయంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు న్యాయపరమైన చర్యలు తప్పవని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) హెచ్చరించింది. ప్రపంచకప్ అధికారిక ప్రసారదారు జియోస్టార్ ఈ విషయంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశముందని ఐసీసీ స్పష్టం చేసింది. పీసీబీకి వార్షిక ఆదాయంలో వాటాగా చెల్లించాల్సిన సుమారు రూ.315 కోట్లను తాత్కాలికంగా నిలిపివేసి, ఆ మొత్తంలో నుంచే ప్రసారదారుకు పరిహారం చెల్లించేందుకు ఐసీసీ సిద్ధమవుతోందని సమాచారం.
భారత్తో మ్యాచ్ను బహిష్కరించాలన్న నిర్ణయాన్ని పీసీబీ ఇప్పటివరకు లిఖితపూర్వకంగా ఐసీసీకి తెలియజేయలేదని అధికారులు తెలిపారు. ఐసీసీ ఈవెంట్లకు సంబంధించి నాలుగేళ్ల క్రితం ప్రసారదారుతో కుదిరిన ఒప్పందంలో భారత్–పాకిస్థాన్ మ్యాచ్లు కూడా భాగమని, అదే ఆధారంగా ప్రసారదారు భారీ మొత్తంలో చెల్లింపులు చేసినట్లు ఒక పీసీబీ అధికారి వెల్లడించారు. అందువల్ల పీసీబీ, ఐసీసీలపై కోర్టును ఆశ్రయించే హక్కు ప్రసారదారుకు ఉందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, న్యాయపరమైన సమస్యల దృష్ట్యా భారత్తో మ్యాచ్ బహిష్కరణ నిర్ణయాన్ని పీసీబీ వెనక్కి తీసుకునే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!