

ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య భవిష్యత్తుపై ఐపీఎల్ వర్గాల్లో చర్చలు జోరందుకున్నాయి. వచ్చే సీజన్‌కు ముందు అతడు జట్టును వీడే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. పాండ్యను దక్కించుకోవడానికి ఏడు ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. అందులో చెన్నై సూపర్ కింగ్స్ ముందంజలో ఉండగా, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ కూడా పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆసక్తి చూపడం లేదని సమాచారం.
తన కెరీర్ మొత్తం బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో శిక్షణ పొందే ఉద్దేశంతో హార్దిక్ ఇటీవల ముంబయి నుంచి బెంగళూరుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రతిరోజూ ముంబయిలో శిక్షణ కోసం ఎక్కువ దూరం ప్రయాణించాల్సి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇకపై జాతీయ జట్టు లేదా ఐపీఎల్ మ్యాచ్‌లు లేని సమయంలో అక్కడే సాధన చేయనున్నాడు.
ఐపీఎల్ 2026లో హార్దిక్ పాండ్య నాయకత్వంలోని ముంబయి ఇండియన్స్ 14 మ్యాచ్‌ల్లో కేవలం 4 విజయాలు మాత్రమే నమోదు చేసి, పాయింట్ల పట్టికలో అట్టడుగు నుంచి రెండో స్థానంలో నిలిచింది. ఈ నిరాశాజనక ప్రదర్శన తర్వాత అభిమానులు అతడి నాయకత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో వచ్చే సీజన్‌కు ముందు ముంబయి ఇండియన్స్ హార్దిక్‌ను ట్రేడ్ చేసే అవకాశాలపై ఊహాగానాలు మరింత పెరిగాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!