

రెండు వారాలకు పైగా క్రీడాభిమానులను అలరించిన ఐచి-నగోయా ఆసియా క్రీడలు జపాన్‌లో ఘనంగా ముగిశాయి. 90 నిమిషాలపాటు సాగిన ముగింపు వేడుకల్లో జపాన్ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే సంగీత, నృత్య ప్రదర్శనలు, లైటింగ్, బాణసంచా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జపాన్ యువరాజు అకిషినో సమక్షంలో ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ అధ్యక్షుడు షేక్ జోవాన్ బిన్ హమద్ అల్ థానీ క్రీడలు ముగిసినట్లు అధికారికంగా ప్రకటించారు. అనంతరం 2030 ఆసియా క్రీడలకు ఆతిథ్యమివ్వనున్న ఖతార్‌కు ఓసీఏ పతాకం, క్రీడల టార్చ్‌ను అందించారు. ఈ క్రీడల్లో 45 దేశాల అథ్లెట్లు పాల్గొనగా, 350కి పైగా రికార్డులు నమోదయ్యాయి.
ముగింపు వేడుకల్లో భారత్ తరఫున షూటర్ నీరూ ధాండా పతాకధారిగా పాల్గొన్నారు. ఈ క్రీడల్లో ఆమె రెండు స్వర్ణాలు, ఒక రజత పతకం సాధించారు. అథ్లెట్ల పరేడ్, జపాన్ సాంస్కృతిక ప్రదర్శనలు, లేజర్ షోతో పాటు క్రీడల సందర్భంగా నమోదైన కీలక ఘట్టాల దృశ్యాలను ప్రదర్శించారు. భారత్-పాకిస్థాన్ క్రికెట్, హాకీ మ్యాచ్‌లకు ఆసియా క్రీడల చరిత్రలోనే అత్యధిక వీక్షణలు లభించినట్లు ఓసీఏ తెలిపింది. గత క్రీడలతో పోలిస్తే మార్కెటింగ్, స్పాన్సర్‌షిప్, ప్రసార హక్కుల ఆదాయం 19 శాతం పెరిగినట్లు ఓసీఏ వెల్లడించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!