

‘రోడ్ టు రీలోడ్’ నామినేషన్లతో హౌస్‌లో వేడెక్కిన వాతావరణం కాస్త చల్లబడినట్లు కనిపించినా, ఎక్కువసేపు ప్రశాంతంగా కొనసాగలేదు. వ్యక్తిగత విషయాల వెల్లడి, వరుస వాగ్వాదాలు, కొత్త కంటెస్టెంట్ల ఎంట్రీపై బిగ్‌బాస్ ప్రకటనతో హౌస్‌లో మళ్లీ ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా త్రిగుణ్‌తో మాట్లాడిన వర్షిణి తన చిన్ననాటి జీవితంలోని బాధలను పంచుకుంటూ భావోద్వేగానికి గురైంది. తండ్రి నుంచి ఆశించిన ఆప్యాయత, భావోద్వేగ మద్దతు తనకు లభించలేదని, తల్లి ఇద్దరు తల్లిదండ్రుల బాధ్యతలను నిర్వర్తించిందని చెప్పింది.
ముకేశ్‌తో తనకున్న అనుబంధం గురించి కూడా వర్షిణి వివరించింది. అతని భావోద్వేగ స్వభావం, తన మాటలను ఓపికగా వినే తీరు తనకు నచ్చుతాయని తెలిపింది. మరోవైపు అమన్, ఝాన్సీ మధ్య అగ్నిపరీక్ష బ్యాచ్ గురించి చర్చ జరిగింది. తాను ఎలాంటి గ్రూప్‌లో భాగం కాదని, వ్యక్తిగతంగానే ఆట ఆడుతున్నానని ఝాన్సీ స్పష్టం చేసింది. నరేష్ తనదైన హాస్యంతో హౌస్‌లో నవ్వులు పూయించాడు.
ఇక ఎపిసోడ్‌లో అతిపెద్ద ట్విస్ట్‌గా కొత్త కంటెస్టెంట్లు బిగ్‌బాస్ హౌస్‌లోకి రానున్నట్లు బిగ్‌బాస్ ప్రకటించారు. వారి ఎంట్రీతో ప్రస్తుతం హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లలో కొందరు బయటకు వెళ్లే పరిస్థితి రావచ్చనే సూచన చేయడంతో అందరిలోనూ ఆందోళన మొదలైంది. రాబోయే టాస్క్‌ను జంటలుగా ఆడాల్సి ఉంటుందని కూడా బిగ్‌బాస్ సూచించారు. దీంతో ఎవరితో జతకట్టాలనే అంశంపై కంటెస్టెంట్లు ఆలోచనలో పడ్డారు.
మరోవైపు అపూర్వ మరోసారి వివాదానికి కేంద్రంగా నిలిచింది. హౌస్‌లో తనకు సరైన ఆదరణ లభించడం లేదని రోహిత్, షాలినితో చెప్పిన ఆమె అనంతరం షాలినితో వాగ్వాదానికి దిగింది. రామ్ ప్రసాద్, త్రిగుణ్‌తోనూ అపూర్వకు మాటల తూటాలు పేలాయి. అనంతరం ‘రోడ్ టు రీలోడ్’ టాస్క్‌లో చరణ్–అపూర్వ జోడీ మొదటి స్థానంలో నిలిచింది. అమన్–త్రిగుణ్ రెండో స్థానంలో, ముకేశ్–ఝాన్సీ మూడో స్థానంలో నిలవగా, రామ్ ప్రసాద్–నరేష్, రోహిత్–షాలినీ తర్వాతి స్థానాల్లో నిలిచారు. మధ్యలో నరేష్ చేసిన ‘టైటానిక్’ స్పూఫ్, అతని కామెడీ వ్యాఖ్యలు హౌస్‌లో కాస్త నవ్వులు పూయించాయి.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!