

బిగ్‌బాస్ తెలుగు 10 కంటెస్టెంట్ల పీఆర్ టీమ్‌ల మధ్య వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. తన తల్లి, చెల్లి గురించి అసభ్యంగా మాట్లాడినట్లు ఆరోపణలు రావడంతో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ రోహిత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. త్రిగుణ్ పీఆర్ టీమ్‌కు చెందిన కొందరు తన కుటుంబ సభ్యుల గురించి నీచంగా మాట్లాడిన ఆడియో రికార్డింగ్స్ విన్నానని ఇటీవల నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో వెల్లడించాడు. అయితే ఈ వ్యవహారంలో త్రిగుణ్‌ను నేరుగా తప్పుబట్టడం లేదని, అతని పీఆర్ టీమ్, అభిమానుల్లో కొందరు హద్దులు దాటి వ్యవహరిస్తున్నారని ఆరోపించాడు. తన కుటుంబంతో పాటు మహిళా అభిమానులు, వారి కుటుంబ సభ్యులను కూడా లక్ష్యంగా చేసుకోవడం సరికాదని పేర్కొన్నాడు.
ఇప్పటివరకు తనపై వచ్చిన విమర్శలు, కౌంటర్లను పట్టించుకోకుండా మౌనంగా ఉన్నానని, కానీ తన తల్లి, చెల్లి గురించి మాట్లాడటాన్ని మాత్రం సహించలేనని రోహిత్ స్పష్టం చేశాడు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సంబంధిత వ్యక్తుల వివరాలను బయటపెడతానని హెచ్చరించాడు. ఇప్పటికే తాను బిగ్‌బాస్ పోటీ నుంచి ఎలిమినేట్ అయ్యానని, ఇప్పుడు తమ కంటెస్టెంట్‌ను గెలిపించుకోవడంపై దృష్టి పెట్టాలని త్రిగుణ్ అభిమానులకు సూచించాడు. తన కుటుంబాన్ని లేదా మహిళా అభిమానులను లక్ష్యంగా చేసుకుంటే నేరుగా స్పందించాల్సి వస్తుందని తెలిపాడు. ఇది వార్నింగ్ కాదని, మరోసారి ఇలాంటి పనులు చేయొద్దంటూ చేస్తున్న విజ్ఞప్తి అని రోహిత్ పేర్కొన్నాడు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!