

విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘం, సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన హక్కు అని పేర్కొన్న ఆమె.. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల సవరణ పేరుతో పెద్ద సంఖ్యలో ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. సుమారు 13 కోట్ల మంది ఓటర్ల పేర్లు ప్రభావితమయ్యాయని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల సంఘం స్వతంత్రతపై కూడా ఆమె ప్రశ్నలు లేవనెత్తారు. అయితే ఇవి షర్మిల, కాంగ్రెస్ చేసిన ఆరోపణలు మాత్రమే కాగా.. ఎన్నికల సంఘం మాత్రం తన నిర్ణయాలు చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగానే ఉంటాయని, కమిషన్‌లో సభ్యుల మధ్య అభిప్రాయాలు, సూచనలు ఉండటం సాధారణ ప్రక్రియలో భాగమేనని తెలిపింది.
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని లేదా ఆయనను పదవి నుంచి తొలగించాలని షర్మిల డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితాలో జరిగినట్లు ఆరోపిస్తున్న మార్పులపై సమగ్ర విచారణ జరిపించాలని, తప్పులు రుజువైతే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే తొలగించారని చెబుతున్న ఓటర్ల పేర్లను పునరుద్ధరించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) నేపథ్యంలో ఎన్నికల సంఘం పనితీరు, ఓటర్ల హక్కులపై రాజకీయ పార్టీల మధ్య వివాదం కొనసాగుతోంది. జ్ఞానేశ్ కుమార్ 2024 మార్చిలో ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. అనంతరం సీఈసీగా బాధ్యతలు చేపట్టారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!