

నటి శ్రుతిహాసన్ మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. హారర్ థ్రిల్లర్ ‘అశ్విన్స్’తో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు తరుణ్ తేజ్ దర్శకత్వంలో ఆమె ఓ సినిమా చేయనున్నారు. శాంతి టాకీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మంగళవారం అధికారికంగా ప్రకటించారు. కొత్త జానర్‌లో, విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా రూపొందనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. సినిమా టైటిల్, ఇతర నటీనటులు, విడుదల తేదీకి సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా, సినిమాల్లో మహిళల చిత్రీకరణ, తన వ్యక్తిగత నిర్ణయాలపై శ్రుతిహాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘పెద్ది’ చిత్రంలోని ప్రత్యేక గీతం గురించి, నటీమణుల స్క్రీన్ ప్రెజెన్స్‌పై వస్తున్న విమర్శల గురించి ఆమె స్పందించారు. తనకు డ్యాన్స్ చేయడం, అందంగా ముస్తాబవడం ఇష్టమని, అయితే ఈ విషయంలో తనకు నచ్చినట్లుగానే వ్యవహరిస్తానని చెప్పారు. ఇతరులను మెప్పించేందుకు తాను ఎప్పుడూ ప్రయత్నించనని స్పష్టం చేశారు. ఏదైనా దుస్తులు సౌకర్యంగా అనిపించకపోతే ధరించనని వెంటనే చెబుతానన్నారు. ఈ వైఖరి వల్ల కొందరు తనను మొండిదానిగా అభివర్ణించినా పట్టించుకోనని తెలిపారు. మహిళల అనుభవాలు, సినిమాల్లో వారి చిత్రీకరణపై ప్రస్తుతం జరుగుతున్న చర్చల్లో వచ్చిన మార్పు సంతోషాన్నిస్తోందని, ఎనిమిదేళ్ల క్రితం ఇలాంటి అంశాలపై ఇంత విస్తృతంగా చర్చ జరిగేది కాదని శ్రుతి పేర్కొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!