

భారత్‌లో ఉద్యోగుల్లో ఏకంగా 96 శాతం మంది కృత్రిమ మేధ (ఏఐ)ను రోజూ లేదా వారానికి రెండు, మూడు సార్లు వినియోగిస్తున్నారని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) నివేదిక వెల్లడించింది. తొమ్మిది ఆసియా-పసిఫిక్ మార్కెట్లలో ఇదే అత్యధికమని పేర్కొంది. ఫర్ ఆసియా-పసిఫిక్, స్ట్రాటజిక్ క్లారిటీ ఈజ్ ది కీ టు వాల్యూ పేరుతో విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం.. ఏఐ వినియోగం వల్ల భారతీయ ఉద్యోగులకు వారానికి సగటున 15 గంటల సమయం ఆదా అవుతోంది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఈ సగటు 9.4 గంటలుగా ఉంది. భారత్‌లో 61 శాతం మంది ఉద్యోగులు ఏఐ ద్వారా ఆదా అయిన సమయాన్ని అదనపు వ్యూహాత్మక పనులకు వినియోగిస్తున్నారు. ప్రాంతీయ సగటు 44 శాతంగా ఉండగా, ఈ విషయంలో భారత్ మొదటి స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా 60 శాతంతో రెండో స్థానంలో, చైనా 37 శాతంతో తర్వాతి స్థానంలో ఉన్నాయి. అలాగే భారత్‌లో 38 శాతం మంది ఉద్యోగులకు ఏఐ వినియోగంపై వ్యూహాత్మక స్పష్టత ఉండగా.. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఈ వాటా 20 శాతంగా నమోదైంది.
భారత్‌లో 42 శాతం మంది ఉద్యోగులు తమకు అందిస్తున్న ఏఐ శిక్షణ సరిపోతుందని అభిప్రాయపడ్డారు. మరో 59 శాతం మంది తమ సంస్థల్లో మానవులు, ఏఐ కలిసి పనిచేసేందుకు అవసరమైన మార్గదర్శకాలు ఉన్నాయని తెలిపారు. ఆస్ట్రేలియా, చైనా, భారత్, ఇండొనేషియా, జపాన్, మలేషియా, సింగపూర్, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్‌కు చెందిన మొత్తం 6,349 మంది ఉద్యోగుల అభిప్రాయాల ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు. వీరిలో 882 మంది భారతీయులు ఉన్నారు. ఈ నివేదికపై బీసీజీ ఎక్స్ ఇండియా లీడర్ నిపుణ్ కల్రా మాట్లాడుతూ.. పని ఎంత వేగంగా పూర్తవుతుందనే అంశంతో పాటు ఉద్యోగులు తమ సమయాన్ని ఏ పనులపై కేటాయించగలరనే విషయంలోనూ ఏఐ మార్పులు తీసుకొస్తోందని అన్నారు. సంస్థలు పని విధానాలను పునరాలోచించి, ఉద్యోగుల సామర్థ్యాలను పెంపొందించడంతో పాటు మెరుగైన వ్యాపార ఫలితాల కోసం ఏఐని ఎలా వినియోగించాలో స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని అభిప్రాయపడ్డారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!