

ఆదాయానికి మించిన ఆస్తుల కేసును నీరుగార్చేందుకు రూ.30 లక్షలు లంచంగా డిమాండ్ చేసినట్లు ఓ ఏసీబీ దర్యాప్తు అధికారిపై ఆరోపణలు వచ్చాయి. హైదరాబాద్ శివార్లలోని విద్యుత్తు పంపిణీ సంస్థలో పనిచేస్తున్న ఓ అధికారిపై ఏడాది క్రితం ఈ కేసు నమోదైంది. ఈ కేసులో బెయిల్‌పై విడుదలైన నిందితుడు.. దర్యాప్తు అధికారి తనను సంప్రదించి, డబ్బులు ఇస్తే కేసును తనకు అనుకూలంగా మార్చేలా సహకరిస్తానని చెప్పినట్లు ఏసీబీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అంతకుముందు నిందితుడు జైలులో ఉన్న సమయంలో ఓ కాంట్రాక్టర్ అతడిని కలిసి, దర్యాప్తు అధికారి తనకు పరిచయమని, డబ్బులు ఇస్తే కేసు మూసివేయించేలా చూస్తానని చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
కేసులో బినామీగా చేర్చిన మరో అధికారిని జాబితా నుంచి తొలగించేందుకు రూ.15 లక్షలు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసును బలహీనపరిచేందుకు మరో రూ.15 లక్షలు డిమాండ్ చేసినట్లు నిందితుడు ఆరోపించారు. ఈ ఏడాది మే 2న దర్యాప్తు అధికారి నివాసానికి సమీపంలోని ఓ ఫార్మసీ వద్ద ఆయనను కలిసినట్లు, ఆ సమయంలో తొలి విడతగా రూ.5 లక్షలు ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మే 7న మరోసారి కలిసినప్పుడు బినామీ అధికారిని తొలగించేందుకు ఫైల్ సిద్ధం చేస్తున్నామని, మిగిలిన డబ్బులు సమకూర్చుకోవాలని దర్యాప్తు అధికారి చెప్పినట్లు ఆరోపించారు. మే 14న కూడా డబ్బుల విషయమై ఫోన్ ద్వారా మాట్లాడినట్లు ఫిర్యాదులో వివరించారు. ఈ ఆరోపణలపై ఏసీబీ ఉన్నతాధికారులు అంతర్గత విచారణ ప్రారంభించినట్లు సమాచారం. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని బదిలీ చేయడంతో పాటు, ఆయన గతంలో దర్యాప్తు చేసిన కేసులను ఇతర అధికారులకు అప్పగించినట్లు తెలిసింది. ఈ ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!