

మెగాస్టార్ చిరంజీవి మరో సరికొత్త అవతారంలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. దశాబ్దాలుగా వెండితెరపై తన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆయన.. ఇప్పుడు ఓటీటీ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ‘చిరంజీవి మెగావర్స్’ పేరుతో టాక్ షో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించడంతో పాటు తాజాగా ప్రోమోను విడుదల చేసింది. చిరంజీవి కూడా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను పంచుకుంటూ.. ‘ఎన్ అంటే నెట్‌ఫ్లిక్స్.. మెగా కలయిక కుదిరింది.. మెగా నాస్టాల్జియా, మెగా నవ్వులు, మెగా ముచ్చట్లు’ అంటూ ఆసక్తికర క్యాప్షన్ ఇచ్చారు. చిరంజీవి పేరులోని ‘ఎన్’ అక్షరాన్ని నెట్‌ఫ్లిక్స్‌తో అనుసంధానిస్తూ రూపొందించిన ప్రోమో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులతో వారి వ్యక్తిగత జీవితం, సినీ ప్రయాణం, కెరీర్‌లోని ఆసక్తికర సంఘటనలపై చిరంజీవి ముచ్చటించనున్నట్లు తెలుస్తోంది. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఆటమ్ మీడియా వెంచర్స్, సోల్ ప్రొడక్షన్ ఎల్‌ఎల్‌పీ సంస్థలు సంయుక్తంగా ఈ షోను నిర్మిస్తున్నాయి.
తొలి సీజన్‌లో మొత్తం 15 ఎపిసోడ్లు ఉండనున్నట్లు సమాచారం. ప్రముఖ హాస్యనటులు బ్రహ్మానందం, సునీల్, సత్య తదితరులు అతిథులుగా పాల్గొనే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే అతిథుల జాబితాపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ షో నవంబర్ 30న సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభమవుతుందని కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నప్పటికీ.. నెట్‌ఫ్లిక్స్ ఇంకా విడుదల తేదీ, సమయాన్ని ధ్రువీకరించలేదు. గతంలో చిరంజీవి ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించారు. ఇప్పుడు తొలిసారిగా ఓటీటీ వేదికపై టాక్ షోతో సందడి చేయనున్నారు. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’, జగపతిబాబు ‘జయమ్ము నిశ్చయమ్మురా’ వంటి కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరించారు. ఈ నేపథ్యంలో చిరంజీవి ‘మెగావర్స్’పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!