

తెలంగాణలో సాగునీటి హక్కులు, ప్రాజెక్టుల నిర్వహణ అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నీళ్ల విషయంలో ముఖ్యమంత్రి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణకు సాగునీటి హక్కులు సాధించేందుకు కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ఎన్నో పోరాటాలు చేసిందని గుర్తుచేశారు. నాగార్జున సాగర్, జూరాల, ఎస్సారెస్పీ, పాలమూరు-రంగారెడ్డి సహా పలు ప్రాజెక్టుల ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి ఆయకట్టును అభివృద్ధి చేసిందని, మిషన్ కాకతీయ, చెక్‌డ్యాంల నిర్మాణం, కొత్త ప్రాజెక్టుల వల్ల తెలంగాణ వరి ఉత్పత్తిలో అగ్రస్థానానికి చేరుకుందని తెలిపారు.
కృష్ణా జలాల పంపిణీ, 299:512 టీఎంసీల నీటి వాటా, పల్నాడు వాటర్ గ్రిడ్, రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవాలను వక్రీకరిస్తోందని హరీశ్ రావు ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయా ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కేంద్రానికి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు అనేక లేఖలు రాసిందని వివరించారు. ప్రస్తుత ప్రభుత్వం మూడేళ్లలో కొత్త ఆయకట్టుకు ఎంత నీరు అందించిందో, ప్రాజెక్టుల పనుల పురోగతి ఏమిటో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ నీటి హక్కుల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని, కృష్ణా జలాలపై ట్రిబ్యునల్ ముందు బలంగా వాదనలు వినిపించాలని కోరారు. ఈ సమావేశంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!