

ఆర్‌డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం రూ.620 కోట్లను విడుదల చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన కాంట్రాక్టర్లు, మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం వెలుపల సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. నవ్యాంధ్ర ఆర్‌డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కోనేరు శ్రీనివాస్ ప్రసాద్ మాట్లాడుతూ.. జల్ జీవన్ మిషన్ కాంట్రాక్టర్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులను క్లియర్ చేసినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి సహకారంతో 31 మార్చి 2026 వరకు పెండింగ్‌లో ఉన్న బిల్లుల చెల్లింపులు పూర్తయ్యాయని వెల్లడించారు.
ఈ ఏడాది జూన్ 18న కాంట్రాక్టర్లతో జరిగిన సమావేశంలో పెండింగ్ చెల్లింపులను త్వరగా క్లియర్ చేస్తామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారని శ్రీనివాస్ తెలిపారు. అధికారుల నిరంతర కృషితో బిల్లుల చెల్లింపులు జరిగాయని చెప్పారు. అలాగే, నవంబర్ 2024 నుంచి 31 మార్చి 2026 వరకు రెట్రోఫిట్టింగ్ పనులకు సంబంధించిన రూ.647 కోట్ల బిల్లులను కూడా ప్రభుత్వం చెల్లించిందన్నారు. స్పర్శ పథకం కింద సుమారు రూ.138 కోట్ల బిల్లులు రావాల్సి ఉండగా, సాంకేతిక సమస్యల కారణంగా ఇప్పటివరకు సుమారు రూ.70 కోట్లు చెల్లించారని తెలిపారు. మిగిలిన మొత్తాన్ని త్వరలో చెల్లిస్తామని అధికారులు హామీ ఇచ్చారని చెప్పారు. పెండింగ్ బిల్లుల చెల్లింపులతో ఎంఎస్‌ఎంఈ రంగానికి చెందిన ఆర్‌డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్లకు ఆర్థిక ఉపశమనం లభించిందని అసోసియేషన్ పేర్కొంది. ఇకపై నెలనెలా నిర్దిష్ట విధానంలో చెల్లింపులు జరిగేలా ప్రణాళిక రూపొందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు తెలిపింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!