

తెలంగాణలో అప్రజాస్వామిక పాలన కొనసాగుతున్నప్పుడు దేశవ్యాప్తంగా రాజ్యాంగ పరిరక్షణపై ప్రచారం చేస్తూ అదే రాజ్యాంగాన్ని అపహాస్యం చేయవద్దని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మంగళవారం ‘ఎక్స్’లో స్పందించిన ఆయన.. ముఖ్యమంత్రి కుటుంబ అవినీతిని ఆధారాలతో ప్రశ్నించినందుకే బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌ను అరెస్టు చేశారని ఆరోపించారు. ఇతరులపై నిరాధార ఆరోపణలు చేయడానికి అవకాశం ఉన్నప్పుడు, ఆధారాలతో ప్రశ్నించిన తమ పార్టీ నేతను జైలుకు పంపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై దృష్టి సారించి, ముఖ్యమంత్రి అప్రజాస్వామిక విధానాలను నియంత్రించాలని రాహుల్‌గాంధీని కేటీఆర్ కోరారు.
ఇదిలా ఉండగా, విధి నిర్వహణలో బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మెదక్ టౌన్ కానిస్టేబుల్ దావసోత్ శంకర్‌కు కేటీఆర్ అండగా నిలిచారు. శంకర్ వైద్యానికి అయ్యే మొత్తం ఖర్చును తానే భరిస్తానని మంగళవారం ‘ఎక్స్’ ద్వారా ప్రకటించారు. ఆయన పూర్తిగా కోలుకునే వరకు కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. విధి నిర్వహణలో కష్టపడి పనిచేసే సాధారణ పోలీసుల పరిస్థితిపై కనీసం ఈ ఘటన తర్వాతైనా ప్రభుత్వం దృష్టి సారించాలని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!