

ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో ఉద్యమం తీవ్రమవుతున్న నేపథ్యంలో.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల సంఘం (ఈసీ) తీసుకున్న అన్ని నిర్ణయాలను పరిశీలిస్తామని, చట్టానికి అనుగుణంగా లేని వాటిని రద్దు చేస్తామని స్పష్టం చేసింది. వివిధ రాష్ట్రాల్లో ‘ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ’ (ఎస్‌ఐఆర్) సందర్భంగా ఈసీ ఉపయోగిస్తున్న ఫారం 6లో ఎటువంటి మార్పులకు తాము అంగీకరించలేదని తెలిపింది. ఈసీ నిర్ణయాలన్నీ కూడా ఏకాభిప్రాయంతో లేదా మెజారిటీతో కూడినవి అయి ఉండాల్సిందేనని, ఇప్పటి వరకూ ఈసీ ఈ విధంగానే నిర్ణయాలు తీసుకున్నట్లు భావిస్తున్నామని పేర్కొంది. ఈసీ పనితీరు చట్టవ్యతిరేకంగా ఉంటే దానికి పర్యవసానాలు ఉంటాయని హెచ్చరించింది.
సర్‌లో, ఫారం-6లో మార్పులకు సంబంధించి ఈసీలో ఇద్దరు కమిషనర్ల అభిప్రాయాలను తోసిరాజంటూ సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఒక్కరే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ ఇటీవల ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’లో వచ్చిన కథనం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దాఖలైన ప్రజాప్రయోజన వాజ్యాలపై (పిల్) సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యాబాగ్చీ, జస్టిస్ మోహనలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. పిటిషనర్లు రాకేశ్‌కుమార్‌సింగ్, శైలేంద్రమణి త్రిపాఠి తరఫున సీనియర్ న్యాయవాదులు వికాస్‌సింగ్, మేనక గురుస్వామి, వాదనలు వినిపించారు.
ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ స్పందిస్తూ.. ‘ఈసీ ఎలా పని చేయాలో చట్టం స్పష్టంగా నిర్దేశిస్తోంది. దానిని వాళ్లు అనుసరిస్తున్నారనే భావిస్తున్నాం. ఎలాంటి ఉల్లంఘన ఉన్నా మేం దాన్ని కొట్టేయగలం. చట్టప్రకారం ఈసీ నిర్ణయాలు ఏకాభిప్రాయంతో లేదా మెజారిటీతో తీసుకున్నవి అయి ఉండాలి. అలా లేకుండా తీసుకున్న నిర్ణయాలను కోర్టు కొట్టివేస్తుంది. కోర్టుకున్న శక్తిసామర్థ్యాలు ఏమిటో మీకు తెలుసు!’ అని తెలిపారు. తీర్పు వెలువడేంతవరకూ సీఈసీ నిర్ణయాలు తీసుకోకుండా ఆదేశించాలన్న విజ్ఞప్తిని కూడా జస్టిస్ సూర్యకాంత్ అంగీకరించలేదు. ఈసీ, కేంద్రప్రభుత్వాల స్పందనలు ఏమిటో తెలుసుకోకుండా, కేవలం వార్తాపత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ఆదేశాలు జారీ చేయలేమన్నారు. సీఈసీ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి పదవిలో ఉన్నప్పుడేగాక, పదవీ విరమణ తర్వాత కూడా.. ఎటువంటి న్యాయవిచారణ ఎదుర్కోకుండా రక్షణ కల్పిస్తూ ఇటీవల చట్టంలో చేసిన మార్పులను వికాస్ సింగ్ ప్రస్తావించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ఈ తరహా రక్షణలు జడ్జిలకు కూడా లేవని వ్యాఖ్యానించింది. వీటిని సమీక్షిస్తామని స్పష్టం చేసింది. పిటిషనర్లు లేవనెత్తిన అంశాలపై వారం రోజుల్లో స్పందించాలంటూ ఈసీ, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!