

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇచ్చిన తాజా తీర్పుపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామ్ చందర్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక వ్యక్తి ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆరు నెలల లోపే మరో పార్టీలో చేరి అదే పార్టీ తరఫున లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం రాష్ట్ర ప్రజలు చూసిన విషయమని ఆయన అన్నారు. ఇంత స్పష్టమైన పరిస్థితులు ఉన్నప్పటికీ దాన్ని పార్టీ ఫిరాయింపుగా పరిగణించలేమని చెప్పడం ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించారు. ఒక పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి మరో పార్టీ అభ్యర్థికి ప్రచారం చేయడం, అదే పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేయడం వంటి స్పష్టమైన రికార్డులు ఉన్నప్పటికీ కూడా ఇది పార్టీ ఫిరాయింపు కాదని చెప్పడం ప్రజాస్వామ్యాన్ని అవమానించే తీర్పు అని ఆయన విమర్శించారు.
అలాగే యాంటీ డిఫెక్షన్ చట్టాన్ని మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ తీసుకొచ్చారని, ఆ సమయంలో రాజ్యాంగ సవరణ ద్వారా ఆ చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చారని రామ్ చందర్ రావు గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలనలోనే యాంటీ డిఫెక్షన్ చట్టం స్పష్టంగా ఉల్లంఘనకు గురవుతున్న పరిస్థితుల్లో స్పీకర్ ఇలాంటి తీర్పు ఇవ్వడం రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కడమేనని ఆయన విమర్శించారు.
రాహుల్ గాంధీ ఒకవైపు రాజ్యాంగాన్ని కాపాడుతున్నామని చెప్పుకుంటూ తిరుగుతున్నారని, మరోవైపు తమ పార్టీకి చెందిన నాయకుల చర్యలను సమర్థించేలా ఇలాంటి తీర్పులు రావడం ఎలా సమర్థించగలరని రామ్ చందర్ రావు ప్రశ్నించారు. ఈ రోజు వచ్చిన తీర్పు ప్రజాస్వామ్యాన్ని మాత్రమే కాదు, రాజ్యాంగాన్ని మరియు ప్రజల తీర్పును కూడా అగౌరవపర్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ తీర్పుపై భారతీయ జనతా పార్టీ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తోందని రామ్ చందర్ రావు స్పష్టం చేశారు.








.jpg&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!