

ఇరాన్‌పై మరింత విస్తృత స్థాయిలో సైనిక దాడులు చేపట్టే ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాత్కాలికంగా నిలిపివేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అమెరికా వైమానిక రక్షణ వ్యవస్థలకు అవసరమైన ఇంటర్‌సెప్టర్ క్షిపణుల నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయని సీనియర్ సైనికాధికారులు హెచ్చరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ జనరల్ డాన్ కేన్ సహా పలువురు అధికారులు పరిస్థితిని ట్రంప్‌కు వివరించినట్లు వార్తలు పేర్కొన్నాయి.
ప్రస్తుతం ఇరాన్ తక్కువ ఖర్చుతో కూడిన డ్రోన్‌లను పెద్దఎత్తున వినియోగిస్తుండగా, వాటిని అడ్డుకోవడానికి అమెరికా అత్యంత ఖరీదైన ఇంటర్‌సెప్టర్ క్షిపణులను వినియోగిస్తోంది. పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలు, యుద్ధ నౌకలు, మిత్రదేశాల రక్షణ కోసం భారీగా క్షిపణులు వినియోగించడంతో నిల్వలపై ఒత్తిడి పెరిగినట్లు తెలుస్తోంది. అయితే దాడులను పూర్తిగా విరమించలేదని, పరిస్థితులను బట్టి మళ్లీ విస్తరించే అవకాశముందని అధికారులు చెబుతుండగా, ఈ విరామాన్ని దౌత్యపరమైన చర్చలకు కూడా ఉపయోగించాలనే ఆలోచనలో అమెరికా ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!