

రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రత్యేక సారాంశ సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా ఎన్నికల అధికారులు, కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ, ఈ ప్రక్రియ పూర్తిగా తప్పులు లేని ఓటరు జాబితా తయారీ కోసం మాత్రమేనని తెలిపారు. ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణకు మరో ఐదు రోజులు మాత్రమే గడువు ఉండటంతో, ఆగస్టు 3లోగా డిజిటలైజేషన్ను 100 శాతం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 76 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 90 శాతం డిజిటలైజేషన్ పూర్తయిందని వెల్లడించారు.
శేరిలింగంపల్లి, రంగారెడ్డి, మేడ్చల్, జీహెచ్ఎంసీతో పాటు పట్టణ ప్రాంతాల్లో డిజిటలైజేషన్ పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఓటర్ల వివరాల అప్లోడ్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా బీఎల్ఓలు, సూపర్వైజర్లు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. నిర్లక్ష్యం వహించే అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, మరణించిన లేదా చిరునామా మార్చిన ఓటర్ల జాబితా తయారీ, రాజకీయ పార్టీలతో సమావేశాల వీడియోగ్రఫీ వంటి అంశాలను ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!