

ఈ నెల 12న న్యూఢిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్స్ సదస్సు సందర్భంగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఇరువురు నేతలు భారత్-చైనా సంబంధాలపై స్నేహపూర్వకంగా, లోతుగా చర్చించి. రెండు దేశాలు ప్రత్యర్థులుగా కాకుండా భాగస్వాములుగా ఉండాలనే కీలక అభిప్రాయానికి వచ్చారు. వ్యూహాత్మక, దీర్ఘకాలిక దృక్పథంతో భారత్‌తో సంబంధాలను చైనా కొనసాగిస్తోందని జిన్‌పింగ్ తెలిపారు. గత రెండేళ్లలో ఇరువురి మధ్య జరిగిన సమావేశాలతో ద్వైపాక్షిక సంబంధాల్లో సానుకూల మార్పులు వచ్చాయని, సంస్థాగత చర్చలు పునఃప్రారంభమయ్యాయని, సహకారం విస్తరించిందని, వాణిజ్యం కొత్త గరిష్ఠానికి చేరిందని చెప్పారు.
భారత్-చైనా సంబంధాల అభివృద్ధికి నాలుగు అంశాలను జిన్‌పింగ్ సూచించారు. పరస్పర ప్రయోజనకర సహకారాన్ని బలోపేతం చేయడం, పరస్పర గౌరవంతో విభేదాలను పరిష్కరించడం, సరిహద్దు ప్రాంతాల్లో శాంతిని కొనసాగించడం, బహుపాక్షిక వేదికలపై సమన్వయాన్ని పెంచడం వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. భారత్ కూడా చైనాను ప్రత్యర్థిగా కాకుండా భాగస్వామిగా చూస్తోందని మోదీ తెలిపారు. భారత్ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరిస్తుందని, అది మూడో దేశ ప్రభావానికి లోబడి ఉండదని స్పష్టం చేశారు. ఇరుదేశాల మధ్య ఉన్నతస్థాయి చర్చలు, ఆర్థిక సహకారం, ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయాలని మోదీ ఆకాంక్షించారు. వచ్చే ఏడాది చైనా చేపట్టనున్న బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలకు భారత్ మద్దతు ప్రకటించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!