

తనపై వస్తున్న ఆరోపణలు, వ్యక్తిత్వ హననానికి సంబంధించిన ప్రచారంపై జనసేన నాయకురాలు రుక్మిణి కోటా ఘాటుగా స్పందించారు. తన వ్యక్తిగత జీవితంపై కల్పిత కథనాలు ప్రచారం చేస్తూ, వృత్తిపరమైన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కొంతకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. తన సంస్థలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి తన పేరు, కంపెనీ గుర్తింపు, అధికారిక పత్రాలను దుర్వినియోగం చేసి ఆర్థిక ప్రయోజనాల కోసం ఉద్యోగ నియామక మోసానికి పాల్పడినట్లు వెల్లడించారు. ఈ వ్యవహారంలో తనకు ఎలాంటి ప్రమేయం, అనుమతి లేదా సమ్మతి లేదని స్పష్టం చేశారు. విషయం తెలిసిన వెంటనే సదరు ఉద్యోగికి షోకాజ్ నోటీసు జారీ చేసి వివరణ కోరినట్లు తెలిపారు. అంతర్గత విచారణ అనంతరం ఉద్యోగిని విధుల నుంచి తొలగించడంతో పాటు పోలీసులకు అధికారిక ఫిర్యాదు చేసి చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. అయితే, మోసానికి పాల్పడిన వారిని ప్రశ్నించాల్సింది పోయి, తననే నిందితురాలిగా చిత్రీకరిస్తూ కొన్ని రాజకీయ, మీడియా వర్గాలు వాస్తవాలను వక్రీకరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే, ఈ వివాదంలో జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేరును అనవసరంగా ముడిపెట్టే ప్రయత్నాలను ఆమె తీవ్రంగా ఖండించారు. 2007లో కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్‌తో ప్రారంభమైన తన ప్రయాణం, 2009లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా కొనసాగిందని గుర్తుచేశారు. పవన్ కల్యాణ్ నాయకత్వం, ఆశయాల పట్ల తన నిబద్ధత ఎప్పటికీ మారదని స్పష్టం చేశారు. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి స్ఫూర్తితో పాటు జనసేన ఝాన్సీ వీర మహిళల ధైర్యం తనకు ప్రేరణగా నిలుస్తాయని పేర్కొన్నారు. తన మౌనాన్ని బలహీనతగా, సహనాన్ని లొంగుబాటుగా భావించవద్దని హెచ్చరించారు. ప్రతీకారం కంటే సంయమనాన్ని, భయం కంటే ధైర్యాన్ని, కక్ష సాధింపు కంటే న్యాయాన్ని ఎంచుకుంటానని తెలిపారు. తన గౌరవాన్ని, కుటుంబాన్ని కాపాడుకునేందుకు అవసరమైన ప్రతి చట్టపరమైన మార్గాన్ని అనుసరిస్తానని, బాధ్యులను చట్టబద్ధంగా నిలదీస్తానని స్పష్టం చేశారు. చివరగా ‘సత్యమేవ జయతే’, ‘జై హింద్’ అంటూ తన ప్రకటనను ముగించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!