

మూసీ నది ప్రక్షాళనకు తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని, అయితే ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ పేరుతో లక్షన్నర కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి. రామారావు (కేటీఆర్) ఆరోపించారు. ఈ అంశంపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. అసెంబ్లీలో కేటీఆర్ సహా బీఆర్ఎస్ సభ్యులు డీపీఆర్ తయారీ, ఇళ్ల కూల్చివేతలు, భూసేకరణ, ప్రాజెక్ట్ వ్యయం పెంపు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. కేటీఆర్, సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేష్, బండారు లక్ష్మారెడ్డి కలిసి ప్రాజెక్ట్‌పై పలు సందేహాలు వ్యక్తం చేశారు.
మొత్తం 16 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును లక్షన్నర కోట్లకు పెంచడం వెనుక ఉద్దేశ్యం ఏమిటో ప్రభుత్వం వెల్లడించాలని వారు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఒకవైపు భారీ వ్యయాన్ని పేర్కొనగా, సభలో మాత్రం తక్కువ అంచనాలు చెప్పడం ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. గెజిట్ ప్రకారం 10,000కు పైగా ఇళ్లు కూల్చివేతకు గురవుతాయని, 3,260 ఎకరాల భూమి సేకరణ జరుగుతుందని తెలిపారు. బఫర్ జోన్ విస్తరణపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ, ప్రజల ఇళ్లు, ఆస్తులు, జీవనోపాధిపై ప్రభావం చూపే చర్యలను బీఆర్ఎస్ అంగీకరించదని, పారదర్శకత లేకుండా తీసుకునే నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.
ప్రభుత్వం వద్ద డీపీఆర్ ఉన్నదా లేదా అన్నదానిపై కూడా స్పష్టత లేదని కేటీఆర్ విమర్శించారు. మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ సైతం డీపీఆర్ లేదని చెబుతున్నారని తెలిపారు. ప్రజలకు సంబంధించిన ప్రాజెక్టుపై ఫైవ్ స్టార్ హోటళ్లలో కాకుండా బాధితుల మధ్యే ప్రజెంటేషన్ ఇవ్వాలని తమ డిమాండ్ అని చెప్పారు. అలాగే మూసీ నదిని గతంలో మురికి కూపంగా మార్చిందని కాంగ్రెస్‌పై ఆరోపిస్తూ, ఇప్పుడు అదే పార్టీ భారీ ప్రాజెక్ట్ పేరిట అవినీతికి పాల్పడుతోందని విమర్శించారు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రుణంపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ, బ్యాంక్ అధికారులు డీపీఆర్ అందలేదని చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వం తన సమాచారాన్ని సరిదిద్దుకోవాలని లేదా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నదా అనే సందేహం వ్యక్తమవుతోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!