

ప్రముఖ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే)తో ఎన్డీయే కూటమి కుదుర్చుకునే అవకాశం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ స్పష్టం చేశారు. కరూర్ ఘటనకు సంబంధించి విజయ్‌కు సీబీఐ సమన్లు జారీ చేయడం, అలాగే ఆయన నటించిన ‘జననాయగన్’ సినిమా సెన్సార్ ప్రక్రియలో జాప్యం చోటుచేసుకోవడంలో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. టీవీకేపై ఒత్తిడి తీసుకువచ్చి ఎన్డీయే కూటమిలో చేర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని మీడియాలో వస్తున్న వార్తలను ఆయన ఖండించారు.
తిరుచ్చిలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్న భారీ సభ ఏర్పాట్లపై తంజావూరు జిల్లా కుంభకోణంలో పార్టీ నాయకులతో సమీక్ష నిర్వహించిన అనంతరం నాగేంద్రన్ మీడియాతో మాట్లాడారు. కరూర్ వేలుచ్చామిపురంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై సీబీఐ విచారణకు పంపిన నోటీసులకు బీజేపీతో ఎలాంటి సంబంధం లేదని ఆయన అన్నారు. అన్నాడీఎంకే, పీఎంకే, టీఎంసీ వంటి పార్టీలతో తమ కూటమి బలంగా ఉందని, త్వరలోనే సీట్ల సర్దుబాటు చర్చలు ప్రారంభమవుతాయని చెప్పారు. ఈ ఐదేళ్ల డీఎంకే పాలనలో 34 లాకప్ మరణాలు చోటుచేసుకున్నాయని, రాష్ట్రంలో జరుగుతున్న హత్యలపై సీఎం స్టాలిన్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని నాగేంద్రన్ డిమాండ్ చేశారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!