

మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ నేపథ్యంలో ఇండ్లు కోల్పోతున్న మధు పార్క్ అపార్ట్మెంట్ నివాసితులను బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. మాజీ మంత్రి, అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావుతో పాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇంఛార్జి కార్తీక్ రెడ్డి తదితరులు బాధిత కుటుంబాలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలు పేదల పై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ఆరోపించారు. ప్రాజెక్ట్ పేరుతో ఇండ్లు కూల్చివేయడం సరైన విధానం కాదని అన్నారు. పేదలకు ఇళ్లు కూల్చివేసే ముందు చట్టపరమైన అంశాలు పూర్తిగా స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
డీపీఆర్ సిద్ధం కాలేదని, ఎఫ్టీఎల్ అంశం తేలలేదని, అవసరమైన అనుమతులు లేవని పేర్కొంటూ ఇలాంటి పరిస్థితుల్లో ఇండ్లు ఖాళీ చేయమని నోటీసులు ఇవ్వడం సమంజసం కాదని విమర్శించారు. మధు పార్క్ అపార్ట్మెంట్కు జారీ చేసిన నోటీసులను బేషరతుగా వెనక్కి తీసుకోవాలని కోరారు.
ప్రభుత్వ నిర్ణయాల పై రాబోయే బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో తీవ్రంగా నిలదీస్తామని హరీష్ రావు తెలిపారు. పేదల సమస్యల పై ప్రభుత్వం స్పందించాలని, వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!