

హైదరాబాద్‌లో జరిగిన అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాల పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గవర్నర్ ప్రసంగం పై జరిగిన చర్చకు సమాధానం ఇస్తూ ఆయన దాదాపు రెండున్నర గంటల పాటు మాట్లాడారు.
మూసీ ప్రక్షాళన అంశంపై మాట్లాడుతూ, గతంలో కేసీఆర్, కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను సభలో ప్రస్తావించారు. హైదరాబాద్‌లో నాలాలపై సుమారు 28 వేల అక్రమ కట్టడాలు ఉన్నాయని అప్పట్లో కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. నోటీసులు ఇవ్వకుండానే వాటిని కూల్చాలని ఆయన చెప్పారని తెలిపారు. అలాగే నాలాలపై నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా తొలగించాలని కేటీఆర్ కూడా ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. ఇప్పుడు అదే విషయంపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం దుష్ప్రచారమని సీఎం అన్నారు. ప్రతిపక్ష నేతలు విషపూరిత రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
ఇంకా మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డును విక్రయించిందని ఆరోపించారు. ఆ నిర్ణయాన్ని రద్దు చేయాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. అవసరమైతే దానిపై మరింత చర్యలు తీసుకుంటానని చెప్పారు. 2029 లో ఎలా గెలుస్తారో నేను కూడా చూస్తా అంటూ ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. అలాగే చంద్రబాబు సహాయంతో గెలిచినవాడివి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2029 లో మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.
గవర్నర్ ప్రసంగాన్ని చారిత్రాత్మకంగా అభివర్ణించిన సీఎం, అది తెలంగాణ భవిష్యత్తుకు మార్గదర్శకమని అన్నారు. బీఆర్ఎస్ ఇంకా అహంకార ధోరణి మార్చుకోలేదని విమర్శించారు. రాజ్యాంగ పాలనలోనూ కొందరు ఇంకా రాజుల్లా ఆలోచిస్తున్నారని వ్యాఖ్యానించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!