

ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తన అధికార వారసత్వాన్ని కుమార్తె కిమ్ జు యేకు అప్పగించే అవకాశముందని దక్షిణ కొరియా నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ అంచనా వేసింది. ఈ విషయాన్ని ఆ సంస్థ చట్టసభ సభ్యులకు వివరించినట్లు సమాచారం.
కిమ్ జు యేను 2022 లో తొలిసారిగా అధికారికంగా ప్రజల ముందుకు తీసుకొచ్చారు. అప్పటి నుంచి పలు ముఖ్యమైన ప్రభుత్వ కార్యక్రమాలు, సైనిక ప్రదర్శనల్లో ఆమె పాల్గొంటూ కనిపిస్తోంది. ఈ పరిణామాలు ఆమెను భవిష్యత్తు నాయకురాలిగా ప్రోత్సహిస్తున్నాయన్న అభిప్రాయాలను బలపరుస్తున్నాయి.
మొదట్లో ఉత్తర కొరియాలో పురుషాధిక్య రాజకీయ వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని, ఆమెకు వారసత్వ బాధ్యతలు అప్పగించే అవకాశం తక్కువేనని దక్షిణ కొరియా నిఘా వర్గాలు భావించాయి. అయితే ఇటీవలి కాలంలో ఆమె ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో ఆ అంచనాలను పునఃసమీక్షించి, ప్రస్తుతం ఆమె వారసురాలిగా నిలిచే అవకాశాలు గణనీయంగా ఉన్నాయని తాజా నివేదికలో పేర్కొన్నారు.
కిమ్ జోంగ్ ఉన్ కూడా వంశపారంపర్య విధానంలోనే అధికారంలోకి వచ్చారు. ఈ నెలాఖరులో ఉత్తర కొరియాలో వర్కర్స్ పార్టీ సదస్సు జరగనుంది. ఆ సమావేశం సందర్భంగా వారసత్వ ప్రణాళికలపై అధికారిక సంకేతాలు వెలువడే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!