

దాదాపు నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని ముగించేందుకు దౌత్య ప్రయత్నాలు వేగం పెంచిన వేళ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలొదిమిర్ జెలెన్స్కీ భేటీ అయ్యారు. ఫ్లోరిడాలో జరిగిన ఈ సమావేశంలో యుద్ధం ముగింపు పై దృష్టి సారించినట్లు ట్రంప్ వెల్లడించారు. జెలెన్స్కీ కి ఫ్లోరిడా ఎస్టేట్‌కు చేరుకున్న సందర్భంగా ట్రంప్ స్వాగతం పలికారు.
సమావేశానంతరం మీడియాతో మాట్లాడిన ట్రంప్, యుద్ధానికి తుది గడువు ఏదీ నిర్ణయించలేదని, అయితే శాంతి సాధనపైనే పూర్తి దృష్టి పెట్టామని చెప్పారు. దౌత్య చర్చలు తుది దశకు చేరుకున్నాయని పేర్కొన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో ఫోన్లో మాట్లాడినట్లు, ఫలితాల దిశగా చర్చలు సాగినట్లు తెలిపారు. ఈ విషయాలను తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ లోనూ ట్రంప్ పంచుకున్నారు.
రష్యా, ఉక్రెయిన్ రెండూ శాంతిని కోరుకుంటున్నాయి. జెలెన్స్కీతో జరుగుతున్న సమావేశం పై పుతిన్ చిత్తశుద్ధితో ఉన్నారు. యుద్ధం ముగింపు పైనే మా దృష్టి. ప్రస్తుత పరిస్థితుల పై పుతిన్, జెలెన్స్కీ ఒప్పందానికి సిద్ధంగా ఉన్నారు. ఈ యుద్ధంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. నేను ఇప్పటికే పలు యుద్ధాలను ఆపాను, ఇది మాత్రం చాలా క్లిష్టమైనది. ఫ్లోరిడా సమావేశానికి జెలెన్స్కీ ఎంతో శ్రమించారు. ఆయనతో పాటు ఉక్రెయిన్ ప్రజలు ఎంతో ధైర్యవంతులు. చర్చలు కొనసాగుతాయి చివరి దశలో ఉన్నాయి, అని ట్రంప్ అన్నారు.
ఈ భేటీలో ఉక్రెయిన్ కు ఇవ్వాల్సిన భద్రతా హామీల అంశాన్ని ప్రస్తావిస్తానని జెలెన్స్కీ ముందుగానే తెలిపారు. 20 అంశాల ప్రణాళిక పై చర్చ జరగనుందని, అది దాదాపు 90 శాతం సిద్ధమైందని చెప్పారు. ఈ చర్చల్లో అమెరికాతో పాటు ఐరోపా దేశాల భాగస్వామ్యాన్ని కూడా కోరుకుంటున్నట్లు పేర్కొన్నప్పటికీ, తక్కువ వ్యవధిలో అది సాధ్యమవకపోవచ్చని అన్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!