

భారత్–అమెరికా మధ్య వాణిజ్య సంబంధాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్‌తో వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అదే సమయంలో భారత్ పై విధిస్తున్న ప్రతీకార సుంకాలను 18 శాతానికి తగ్గిస్తున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం భారత ఉత్పత్తుల పై అమలవుతున్న 50 శాతం సుంకాలు ఇక పై గణనీయంగా తగ్గనున్నాయి. ఈ మేరకు శ్వేతసౌధం కూడా అదనపు సుంకాల తొలగింపును అధికారికంగా ధ్రువీకరించింది. ఈ పరిణామానికి ముందు, ప్రధాని నరేంద్ర మోడీ కి సోమవారం ట్రంప్ ఫోన్ చేశారు. అనంతరం తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్’ లో ట్రంప్ ప్రకటన చేశారు. ప్రధాని మోదీని తన సన్నిహిత మిత్రుల్లో ఒకరుగా పేర్కొంటూ, ఆయనను శక్తిమంతమైన, గౌరవనీయ నాయకుడిగా అభివర్ణించారు.
ఇద్దరి మధ్య వాణిజ్యం, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, రష్యా నుంచి చమురు దిగుమతుల నిలిపివేత, అలాగే అమెరికా మరియు వెనెజువెలా నుంచి భారత్ మరింత చమురు కొనుగోలు చేసే అంశాల పై చర్చ జరిగినట్లు ట్రంప్ తెలిపారు. ఈ నిర్ణయాలు ప్రపంచ శాంతికి దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
భారత్ అమెరికా ఉత్పత్తులను భారీగా కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందని ట్రంప్ వెల్లడించారు. ఇంధనం, టెక్నాలజీ, వ్యవసాయం, బొగ్గు తదితర రంగాల్లో 500 బిలియన్ డాలర్లకుపైగా విలువైన దిగుమతులకు భారత్ కట్టుబడి ఉందని చెప్పారు. రెండు దేశాల మధ్య బంధం మరింత బలపడనుందని ఆయన పేర్కొన్నారు.
ట్రంప్ ప్రకటన పై ప్రధాని మోదీ స్పందించారు. భారత ఉత్పత్తులపై ఇక నుంచి 18 శాతం మాత్రమే అమెరికా సుంకం అమలవుతుందని తెలిపారు. ఇది ఎంతో సంతోషకరమైన పరిణామమని ఎక్స్‌లో పేర్కొంటూ, 140 కోట్ల మంది భారతీయుల తరఫున ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అయితే వాణిజ్య ఒప్పందం పై ప్రత్యేకంగా ప్రస్తావించలేదు.
ఇదిలా ఉండగా, మోదీ–ట్రంప్ మధ్య ఫోన్ సంభాషణ జరిగిన విషయాన్ని భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ కూడా ధ్రువీకరించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!