

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమంపై నిర్లక్ష్యం సహించబోదని ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలకు కఠినంగా హెచ్చరించారు. హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఆమె ఒక్కొక్కరితో సమావేశమై ‘సర్’ అమలు తీరు, క్షేత్రస్థాయి పరిస్థితులపై సమగ్ర వివరాలు తెలుసుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత ప్రచారాలకే పరిమితమవుతున్న నేతలను ప్రశ్నిస్తూ, ప్రభుత్వ పథకాలు, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఎందుకు వెనుకబడ్డారని నిలదీశారు.
ప్రతి నియోజకవర్గంలో ‘సర్’ పనితీరుపై తన వద్ద ఉన్న వివరాలతో ఆమె నేతలను ప్రశ్నించినట్లు సమాచారం. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పనితీరు ఎందుకు తగ్గిందని ఎంపీ కడియం కావ్యను ప్రశ్నించగా, తాను విస్తృతంగా పర్యటిస్తూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు ఆమె సమాధానం ఇచ్చారు. పార్టీ అంతర్గత విభేదాలు, క్షేత్రస్థాయి పరిస్థితులపై కూడా మీనాక్షి ఆరా తీశారు. ప్రతిపక్షాల ఆరోపణలను సామాజిక మాధ్యమాల ద్వారా సమర్థంగా ఎదుర్కొనాలని నేతలకు సూచించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!