

బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ జరిగితే వాస్తవాలు బయటపడతాయనే ఉద్దేశంతోనే చర్చ జరగకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. డైవర్షన్ పాలిటిక్స్‌తో పేపర్ హెడ్‌లైన్లు, సోషల్ మీడియా ట్రెండ్లు మార్చవచ్చేమో కానీ ప్రజల జీవితాలు, రైతులు, విద్యార్థుల సమస్యలు మారవని అన్నారు. రైతు భరోసా, పెన్షన్లు, ఆరు గ్యారెంటీల అమలుపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని కోరారు.
రాష్ట్రంలో రైతులు పంటలు పండించలేని పరిస్థితి ఏర్పడిందని హరీశ్ రావు అన్నారు. యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారని, నీళ్లు అందక పంటలు ఎండిపోతున్నాయని, విద్యుత్ సరఫరా విషయంలోనూ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో లేని సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు మొదలయ్యాయని ప్రశ్నించారు. విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం, ఉద్యోగులు పీఆర్సీ, డీఏ కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. జాబ్ క్యాలెండర్‌ను జాబ్‌లెస్ క్యాలెండర్‌గా మార్చారని విమర్శించారు. మహిళా ఎమ్మెల్యేలపై దాడి జరిగిందని ఆరోపిస్తూ, వారిపై కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో లేవని, అన్ని వర్గాలపై దాడులు జరుగుతున్నాయని హరీశ్ రావు ఆరోపించారు. ప్రతిపక్ష నేతలు, ఎమ్మెల్యేలపై దాడులు జరిగినా ఫిర్యాదులు స్వీకరించడం లేదని అన్నారు. మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన ఘటనలపై అసెంబ్లీలో చర్చకు అవకాశం ఇవ్వాలని, వారికి మాట్లాడేందుకు మైకులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి, హోంమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఈ ఘటనలపై క్షమాపణ చెప్పాలని కోరారు. తెలంగాణలో పాలన గాడి తప్పిందని పేర్కొంటూ గవర్నర్, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై స్పందించాలని కోరారు. బీఆర్‌ఎస్ ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తుందని హరీశ్ రావు స్పష్టం చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!