

తెలంగాణ అసెంబ్లీ గేట్ నం.3 వద్ద సెప్టెంబర్ 7న జరిగిన ఘటనకు సంబంధించి సైఫాబాద్ పోలీసులు క్రైమ్ నం.363/2026 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఖైరతాబాద్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ ఎం. బాలస్వామి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా భారతీయ న్యాయ సంహిత (BNS)లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. కేటీఆర్, హరీశ్‌రావు సహా పలువురు బీఆర్‌ఎస్ నేతలు, అనుచరుల పేర్లు ఇందులో ఉన్నాయి.
పోలీసుల కథనం ప్రకారం.. నినాదాలతో కూడిన నల్ల టీషర్టులు ధరించిన కొందరిని అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించకపోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం కొందరు పోలీసు కార్డన్‌ను దాటి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారని, విధుల్లో ఉన్న పోలీసులను నెట్టడం, కాలర్లు పట్టుకోవడం, దుర్భాషలాడటం, బెదిరించడం వంటి ఘటనలు జరిగాయని ఫిర్యాదులో ఆరోపించారు. మహిళా పోలీసులపై అభ్యంతరకర వ్యాఖ్యలు, అవమానకరంగా ప్రవర్తించినట్లు కూడా పేర్కొన్నారు. వీడియోలు, సీసీటీవీ, మీడియా ఫుటేజీలను పరిశీలించి ఘటనలో ప్రతి ఒక్కరి పాత్రను నిర్ధారించాలని పోలీసులు దర్యాప్తు చేపట్టనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!