

అమరావతి: కార్యకర్తల పోరాటం, త్యాగాల వల్లే టీడీపీ అధికారంలోకి వచ్చిందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన లీడర్‌షిప్ కాంక్లేవ్ ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ, నాయకులు తమ బలహీనతలను గుర్తించి అధిగమిస్తేనే ఎన్నికల్లో విజయాన్ని సాధించగలరన్నారు. నాయకులు పుట్టరని, తయారవుతారని పేర్కొన్న లోకేశ్ కార్యకర్తలను, ప్రజలను దగ్గర చేసుకోవడం, పార్టీని బలోపేతం చేయడంపై ప్రతి మూడు నెలలకోసారి కాంక్లేవ్ నిర్వహిస్తామని తెలిపారు.
పార్టీ, వ్యక్తిగతం, ప్రభుత్వం అనే మూడు ‘పీ’లను నాయకులు సీరియస్‌గా తీసుకోవాలని లోకేశ్ సూచించారు. ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండటంతో పాటు వారి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుని తమను తాము మార్చుకోవాలని అన్నారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలను గుర్తించి ప్రోత్సహించాలని, పార్టీకి దూరమైన వారిని తిరిగి దగ్గరకు తీసుకురావాలని సూచించారు. నాయకులు తమ నియోజకవర్గాల్లోని పాఠశాలలు, ఆసుపత్రులు, వసతిగృహాలను సందర్శించి సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వ కొనసాగింపు కోసం ప్రజలతో ప్రత్యక్ష అనుబంధం పెంచుకోవాలని చెప్పారు. ఇది టీడీపీ 3.0 వెర్షన్ అని పేర్కొన్న ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత పార్టీ లైన్‌కు అందరూ కట్టుబడి ఉండాలని, ఈగోలు, అహంకారానికి దూరంగా ఉండి ప్రజాసేవకు ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!