

ఆంధ్రప్రదేశ్‌లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను యథావిధిగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) స్పష్టం చేసింది. తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవించిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై అధికారులు సమీక్ష చేపట్టారు. ఇందులో భాగంగా బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను ప్రభావం, వరద పరిస్థితులు, పోలింగ్ నిర్వహణకు ఎదురవుతున్న ఇబ్బందులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా చాలా జిల్లాల్లో వరదలు తగ్గుముఖం పట్టాయని, ఎన్నికల నిర్వహణకు పెద్దగా ఆటంకాలు లేవని కలెక్టర్లు నివేదించారు. కలెక్టర్ల నుంచి అందిన నివేదికలను పరిశీలించిన అనంతరం, పరిస్థితులు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో పోలింగ్ ప్రక్రియను ప్రశాంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులను ఆదేశించింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (జెడ్పీటీసీ), మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (ఎంపీటీసీ) ఎన్నికలు ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే కొనసాగనున్నాయి.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!