

హైదరాబాద్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న అంతర్జాతీయ నకిలీ కాల్‌సెంటర్ ముఠా గుట్టును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బయటపెట్టారు. హర్షల్ రావల్ నేతృత్వంలోని ఈ ముఠా దాదాపు మూడేళ్లుగా అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని వ్యవస్థీకృత సైబర్ మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. తొలుత హర్షల్ రావల్ హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో నకిలీ కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేశాడు. అక్కడ పోలీసులు దాడులు నిర్వహించడంతో ముఠా తమ కార్యకలాపాలను పంజాబ్‌లోని పాటియాలాకు మార్చి, అక్కడ మరో కాల్‌సెంటర్ ఏర్పాటు చేసి మోసాలను కొనసాగించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
ఈ కేసులో హర్షల్ రావల్, ప్రణవ్ పితాదియా, చేతన్ ముంజల్‌ను పాటియాలాలో అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు హైదరాబాద్‌కు తీసుకొచ్చి విచారిస్తున్నారు. ఈ ముఠా వేలాది మంది అమెరికా పౌరులను మోసం చేసినట్లు అధికారులు గుర్తించారు. మోసాల ద్వారా సంపాదించిన సొమ్మును తరలించేందుకు వందల సంఖ్యలో మ్యూల్ బ్యాంకు ఖాతాలను వినియోగించినట్లు అనుమానిస్తున్నారు. బాధితుల నుంచి క్రిప్టోకరెన్సీ రూపంలో డబ్బులు స్వీకరించి, అనంతరం హవాలా మార్గాల్లో నగదు బదిలీ చేసినట్లు ఈడీ దర్యాప్తులో తేలినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో సుమారు రూ.400 కోట్ల విలువైన క్రిప్టో లావాదేవీలు జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!