

బెంగళూరుకు చెందిన ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్ స్టాక్అల్ (Stockal)లో అనధికార ట్రేడింగ్ జరిగిందన్న ఆరోపణలు మదుపర్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తమ అనుమతి లేకుండానే పోర్ట్‌ఫోలియోల్లోని అమెరికా కంపెనీల షేర్లను విక్రయించి, ఆ సొమ్ముతో చౌక ధరలో లభించే షేర్లను కొనుగోలు చేసినట్లు దాదాపు 30 మంది భారతీయ ఇన్వెస్టర్లు ఆరోపించారు. అక్టోబరు 15న టెస్లా, యాపిల్, అమెజాన్, ఆల్ఫాబెట్, ఎన్విడియా వంటి సంస్థలకు చెందిన షేర్లను విక్రయించి, నాస్డాక్లో ట్రేడయ్యే చైనా కంపెనీ జిబావో టెక్నాలజీ షేర్లను కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. తన వద్ద 3 లక్షల డాలర్లకు పైగా విలువైన షేర్లను విక్రయించడంతో రూ.4 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని ఓ ఇన్వెస్టర్ తెలిపారు. మరో మదుపరి తన ఖాతాలోని రూ.29 కోట్ల విలువైన షేర్లను కేవలం రెండు నిమిషాల్లోనే విక్రయించినట్లు ఆరోపించారు. ఇలా దాదాపు 30 మంది ఖాతాల్లో అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు, మొత్తం నష్టం రూ.100 కోట్లకు పైగా ఉండొచ్చని ప్రాథమిక అంచనా.
ఈ పరిణామాలపై పలువురు మదుపర్లు సెబీకి ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద లావాదేవీలపై విచారణ చేపట్టినట్లు స్టాక్అల్ వెల్లడించింది. ఇన్వెస్టర్ల ఖాతాలపై ఫిషింగ్ దాడి జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసినప్పటికీ, తమ ప్లాట్ఫామ్లో లేదా మాతృ సంస్థ బోర్డర్‌లెస్ ప్లాట్ఫామ్లో సైబర్ చొరబాటు జరిగినట్లు ఆధారాలు లేవని తెలిపింది. మరోవైపు, అమెరికా బ్రోకరేజీ సంస్థ డ్రైవ్వెల్త్ ఈ వ్యవహారంపై స్టాక్అల్దే బాధ్యతని పేర్కొన్నట్లు సమాచారం. ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియో వివరాలను అనధికారికంగా మూడో పక్షం యాక్సెస్ చేసిందని, దీనిపై స్టాక్అల్ తగిన చర్యలు తీసుకోలేదని డ్రైవ్వెల్త్ ఆరోపించినట్లు తెలుస్తోంది. దీంతో డిజిటల్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌ల భద్రతపై మదుపర్లలో ఆందోళన నెలకొంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!