

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో ఆరు చోట్ల, గుంటూరు జిల్లాలో ఒకచోట అధికారులు సోదాలు నిర్వహించారు. 2018లో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల కాగా, 2020లో మెయిన్స్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల జవాబుపత్రాలను అర్హత లేని 66 మందితో మూల్యాంకనం చేయించారనే ఆరోపణలు ఉన్నాయి.
ఈ కేసులో మాజీ ఐపీఎస్ అధికారి, ఏపీపీఎస్సీ మాజీ కార్యదర్శి పీఎస్‌ఆర్ ఆంజనేయులు నివాసంలోనూ ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పంచవటి కాలనీలో ఉన్న క్యామ్‌సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయం, ఆ సంస్థ ఎండీ పి. మధుసూదనరావు నివాసంలో సోదాలు నిర్వహించారు. సికింద్రాబాద్ డిఫెన్స్ కాలనీలోని ట్రూగ్రేడర్ సర్వీసెస్ కార్యాలయం, నేరేడ్‌మెట్‌లో అక్కెల్లపెరి శ్రీనివాసరావు, అల్వాల్ వెంకటాపురంలో మహంకాళి రఘురామ్‌కు సంబంధించిన నివాసాలతోపాటు గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకానిలోని ఆవాస రిసార్ట్ హైలాండ్‌లోనూ తనిఖీలు జరిగాయి. ఈ వ్యవహారంపై 2025 ఏప్రిల్‌లో విజయవాడ సూర్యారావుపేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అనంతరం సిట్ విచారణ చేపట్టి వివరాలు సేకరించగా, తాజాగా మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!