

టాలీవుడ్, కోలీవుడ్ చిత్ర పరిశ్రమలకు సంక్రాంతి సీజన్ అత్యంత కీలకమైనది. ఈ నేపథ్యంలో 2027 సంక్రాంతి బాక్సాఫీస్ పోటీ ఇప్పటి నుంచే ఆసక్తికరంగా మారుతోంది. భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు మీడియం రేంజ్ సినిమాలు కూడా పండుగ బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నాయి. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల నుంచి వస్తున్న సినిమాలతో కలిపి దాదాపు వెయ్యి కోట్ల రూపాయల బాక్సాఫీస్ వ్యాపారం జరిగే అవకాశం ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘కాకా’తో పాటు, అనిల్ రావిపూడి తదుపరి చిత్రం కూడా సంక్రాంతి రేసులో నిలవనున్నట్లు తెలుస్తోంది. అనిల్ రావిపూడి తన సినిమా విడుదల తేదీని జనవరి 12గా ముందుగానే ఖరారు చేసినట్లు సమాచారం.
మరోవైపు సాయి దుర్గ తేజ్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘సంబరాల ఏటిగట్టు’, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ‘మహాకాళి’ కూడా సంక్రాంతి సీజన్‌ను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. వీటితో పాటు శర్వానంద్, శ్రీను వైట్ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘జార్జ్ కృష్ణ’, శ్రీవిష్ణు నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఫ్యామిలీ ప్యాక్’ కూడా పండుగ బరిలోకి వచ్చే అవకాశముంది. స్టార్ హీరోల నుంచి యువ కథానాయకుల వరకు పలువురు పోటీపడుతుండటంతో 2027 సంక్రాంతి బాక్సాఫీస్ పోరు మరింత ఆసక్తికరంగా మారనుంది. అయితే ఈ సినిమాల విడుదల తేదీలు, పోటీపై అధికారిక ప్రకటనలు రావాల్సి ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!