

ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ఘన విజయం సాధించింది. గతంలో వైఎస్సార్‌సీపీకి బలమైన పట్టున్న మాచర్ల, పులివెందుల, పుంగనూరు వంటి పురపాలికల్లోనూ కూటమి సత్తా చాటింది. 2021 మున్సిపల్ ఎన్నికల్లో పలు వార్డులను ఏకగ్రీవం చేసుకున్న వైఎస్సార్‌సీపీకి ఈసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సొంత జిల్లా కడపలో కూటమి ఆధిపత్యం ప్రదర్శించింది. పలు పురపాలికల్లో ఛైర్‌పర్సన్ పదవులతో పాటు వార్డు స్థానాలను కైవసం చేసుకుని రాజకీయంగా పైచేయి సాధించింది.
జగన్ కంచుకోటగా భావించే పులివెందులలో మొత్తం 40 వార్డులకు 37 చోట్ల కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. తెదేపా అభ్యర్థి గీతాకుమారి ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాబల్యం ఉన్న పుంగనూరులో 36 వార్డులకు 32 స్థానాలు కూటమికి ఏకగ్రీవమయ్యాయి. మాచర్లలోనూ వైఎస్సార్‌సీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇక్కడ తెదేపా 32, జనసేన 3, భాజపా ఒక వార్డును గెలుచుకున్నాయి. పిడుగురాళ్ల, గురజాల, దాచేపల్లిలోనూ కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2021 ఎన్నికల్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారనే ఆరోపణలు, దాడులు, బెదిరింపుల వివాదాల నేపథ్యంలో తాజా ఫలితాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గతంలో ఏకగ్రీవాలతో ఆధిపత్యం చాటిన ప్రాంతాల్లో ఈసారి కూటమికి ప్రజలు పట్టం కట్టారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!