

త్వరలో జరుగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ డీఎంకే ప్రభుత్వమే ఏర్పడనుందని హైదరాబాద్‌కు చెందిన ‘పారావీల్ కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్’ ప్రకటించింది. రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల్లో పోలింగ్ బూత్‌ల వారీగా అభిప్రాయాలను సేకరించిన ఈ సంస్థ ఒక అంచనాకు వచ్చింది. ఈ సర్వే వివరాలను మంగళవారం చెన్నైలో ఆ సంస్థ సీఈఓ కిరణ్ కొండేటి వెల్లడించారు. డీఎంకేకు 41.5 శాతం, అన్నాడీఎంకేకు 36.2 శాతం, టీవీకేకు 13.6 శాతం, నామ్ తమిళర్ కట్చికి 7.9 శాతం మంది మద్దతు తెలిపారని పేర్కొన్నారు. బూత్ స్థాయి అంచనాలతో శాస్త్రీయ పరిశోధన ద్వారా తమిళనాడులో ప్రవేశించినట్లు కొండేటి తెలిపారు.
తమిళనాడు అసెంబ్లీకి జరుగనున్న ఎన్నికలను పురస్కరించుకుని తమ సంస్థ తరఫున కేకే పారావీల్ అనే వెబ్సైట్ ప్రారంభించి ఎగ్జిట్ పోల్స్ 2026 పేరుతో పారదర్శకంగా సర్వే జరిపామని వెల్లడించారు. ఇందులో, ఇప్పటివరకు సీఎం స్టాలిన్ ప్రభుత్వం అద్భుతంగా ఉందని 41.5 శాతం మంది అభిప్రాయపడ్డారని, విజయ్ పార్టీకి చెన్నైలో అధిక స్థానాల్లో గెలిచే అవకాశాలున్నట్లు తేలిందని అన్నారు. కోవై, డెల్టా జిల్లాలు, దక్షిణ, ఉత్తర, పశ్చిమ తమిళనాడుతో సహా కీలక ప్రాంతాల్లో ఓటరు సెంటిమెంట్ అధ్యయనాలపై తమ పరిశోధన సాగిందని, పాలన అవగాహన, ప్రభుత్వ వ్యతిరేక ధోరణుల వివరణాత్మక విశ్లేషణలతో పాటు ఈ సర్వే జరిపినట్లు వివరించారు. తమకు ఏ పార్టీతో సన్నిహిత సంబంధాలు లేవని స్పష్టం చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఫలితాలకు ముందే ఎన్నికల ట్రెండ్‌ను తమ సంస్థ ఖచ్చితంగా అంచనా వేసిందని, ఆ ఎన్నికల్లో టీడీపీ - జనసేన - బీజేపీ కూటమి అఖండ విజయం సాధిస్తుందని ముందే అంచనా వేశామని కిరణ్ కొండేటి వివరించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!