

ఝార్ఖండ్‌లో మావోయిస్టు ఉద్యమానికి పెద్ద దెబ్బ తగిలింది. సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్న అగ్రనేత మిసిర్ బెస్రాను పోలీసులు అరెస్టు చేశారు. గిరిడీ జిల్లా హర్లాది గ్రామానికి చెందిన 65 ఏళ్ల బెస్రాపై ఝార్ఖండ్, ఒడిశా సహా పలు రాష్ట్రాల్లో 80కు పైగా కేసులు నమోదయ్యాయి. ఆయన తలపై రూ.2 కోట్లకు పైగా రివార్డు ప్రకటించబడింది. మార్చి 31 నుంచి ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన భద్రతా బలగాలు, ధన్‌బాద్ జిల్లా బార్వాడా పోలీస్ స్టేషన్ పరిధిలోని మణియాది ప్రాంతంలో బెస్రాను అదుపులోకి తీసుకున్నాయి. ఈ ఆపరేషన్‌లో మరో ఇద్దరు మావోయిస్టులను కూడా పోలీసులు అరెస్టు చేశారు.
దేశంలో అత్యధిక రివార్డు ప్రకటించిన మావోయిస్టు నేతల్లో మిసిర్ బెస్రా ఒకరిగా గుర్తింపు పొందాడు. కొల్హాన్, సారండా, జరైకేలా అడవుల్లో మావోయిస్టు కార్యకలాపాలకు నాయకత్వం వహిస్తూ మిలిటరీ, రాజకీయ వ్యూహాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించినట్లు అధికారులు తెలిపారు. కాంట్రాక్టర్ల నుంచి భారీగా వసూళ్లు చేసి మావోయిస్టు నెట్‌వర్క్‌కు ఆర్థిక బలం చేకూర్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. బెస్రా అరెస్టుతో ముఖ్యంగా ఈస్టర్న్ రీజినల్ బ్యూరో కార్యకలాపాలకు గట్టి దెబ్బ తగిలిందని భద్రతా వర్గాలు భావిస్తున్నాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!