

తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ సోమవారం పాళయంకొట్టై కేంద్ర కారాగారంలో ఉన్న డీఎంకే ఎమ్మెల్యే జి.వి. మార్కండేయన్‌ను పరామర్శించారు. అనంతరం ఎక్స్‌లో స్పందించిన ఆయన, మార్కండేయన్ అరెస్టు అధికార పార్టీ రాజకీయ కక్షసాధింపులో భాగమేనని ఆరోపించారు. జైలులో ఉన్నప్పటికీ పార్టీ, ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఆయన ఉన్నారని పేర్కొంటూ, డీఎంకే అధ్యక్షుడు ఎం.కే. స్టాలిన్ మార్గదర్శకత్వంలో పార్టీ న్యాయ బృందం ఆయన విడుదల కోసం అన్ని న్యాయపరమైన చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
ప్రస్తుత ప్రభుత్వాన్ని "సోఫా మోడల్ ప్రభుత్వం"గా అభివర్ణించిన ఉదయనిధి, విమర్శలను అణచివేయడానికి అరెస్టులను ఆయుధంగా ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. అత్యవసర పరిస్థితి, మీసా కాలాన్ని ఎదుర్కొన్న డీఎంకే ఇలాంటి చర్యలకు భయపడదని స్పష్టం చేశారు. విలాతికుళం ఎమ్మెల్యే మార్కండేయన్ గతవారం ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్‌పై చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాఖ్యల కేసులో అరెస్టయ్యారు. ఈ అరెస్టును డీఎంకే ప్రజాస్వామ్య స్వరాన్ని అణిచివేసే ప్రయత్నంగా అభివర్ణిస్తుండగా, పోలీసులు మాత్రం బెదిరింపు, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యల ఆధారంగానే కేసు నమోదు చేసినట్లు చెబుతున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!