

హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి ఆలయం వద్ద లక్షలాది మందితో సామూహికంగా వందేమాతరం గీతాలాపన నిర్వహిస్తానని కేంద్ర మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని ఎంఐఎం నేతలు అడ్డుకోవాలనుకుంటే అడ్డుకోవాలని ఆయన సవాల్ చేశారు. వందేమాతరం గీతాన్ని అవమానిస్తే చట్ట ప్రకారం మూడేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉందని తెలిపారు. చట్ట ప్రకారం వ్యవహరిస్తున్న తమను మతతత్వవాదులుగా ఎలా అభివర్ణిస్తారని ప్రశ్నించారు. జాతీయ గీతం, జాతీయ గేయాల పట్ల గౌరవం ఉండాలని ఆయన అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం తీసుకురానున్న స్మార్ట్ రేషన్ కార్డులపై సీఎం, మంత్రుల ఫొటోలు ఎందుకు పెడుతున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు. కర్ణాటకలో సిద్ధరామయ్య హయాంలో వందల కోట్ల రూపాయలతో తయారు చేసిన స్మార్ట్ కార్డులు చివరకు నిరుపయోగంగా మారాయని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో దాదాపు రెండు కోట్ల మందికి కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం అందిస్తోందని, అలాంటప్పుడు రేషన్ కార్డులపై ప్రధాని మోదీ ఫొటో ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. కేంద్రం అందిస్తున్న ఉచిత బియ్యం ప్రజలకు అవసరం లేదా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. సంక్షేమ పథకాల అమలు, స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!