

హైదరాబాద్‌లో ఇటీవల నిర్వహించిన భారత్ సమిట్‌పై భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ సదస్సు కోసం ఖర్చు చేసిన రూ.100 కోట్లను రాష్ట్రంలో కరవు నివారణ చర్యలకు, రైతుల సంక్షేమానికి వినియోగించి ఉంటే ఎంతో ప్రయోజనకరంగా ఉండేదని వ్యాఖ్యానించారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులకు అండగా నిలవాల్సిన నిధులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమిట్ నిర్వహణ కోసం వృథా చేశారని ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత్ సమిట్‌లో ఇటలీకి చెందిన నేత ఫిలిబెక్ ప్రసంగం, రాహుల్‌గాంధీ వ్యవహరించిన తీరుపై కూడా మహేశ్వర్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్‌గాంధీ ఇతరులు రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదివారని, తన ప్రసంగంలో దేశాన్ని దూషించారని ఆరోపించారు. భారత అంతర్గత రాజకీయాల్లో విదేశీయుల జోక్యాన్ని కాంగ్రెస్ ప్రోత్సహిస్తోందని విమర్శించారు. ఈ వ్యవహారంపై రాహుల్‌గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు ఈ అంశంపై డీజీపీకి ఫిర్యాదు చేశారని తెలిపారు. భారత్ సమిట్ ద్వారా రాష్ట్రానికి చేకూరిన ప్రయోజనాలేమిటో ముఖ్యమంత్రి స్పష్టం చేయాలని మహేశ్వర్‌రెడ్డి కోరారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!