

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాపై నిరంతర పర్యవేక్షణ కోసం మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీ ఆదేశించారు. సంబంధిత శాఖల కార్యదర్శులను కూడా ఈ బృందంలో భాగస్వాములుగా చేర్చుతూ, పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొనేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అవసరాన్ని బట్టి రంగాల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకోవాలని కూడా ఆయన సూచించారు.
నిన్న సాయంత్రం జరిగిన భద్రత వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCS) సమావేశానికి ప్రధాని అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావంతో దేశానికి ముడిచమురు, గ్యాస్, పెట్రోలియం ఉత్పత్తులు, ఎరువుల సరఫరా పరిస్థితిని సమీక్షించారు. రసాయన, ఔషధ, పెట్రోకెమికల్స్ వంటి పరిశ్రమలకు అవసరమైన దిగుమతులను ఇతర దేశాల నుంచి పొందే అవకాశాలపై కూడా చర్చించారు. తక్షణ, మధ్యకాలిక మరియు దీర్ఘకాలిక వ్యూహాలపై సమగ్రంగా సమాలోచనలు జరిపారు.
యుద్ధ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఒకే విధంగా ఉంటోందని ప్రధాని పేర్కొంటూ, ఇలాంటి పరిస్థితుల్లో దేశ పౌరుల రక్షణకు అవసరమైన అన్ని చర్యలను చేపట్టాలని ఆదేశించారు. అసౌకర్యాలను తగ్గించేందుకు అన్ని మంత్రిత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని, నిత్యావసర వస్తువులు నల్లబజారుకు వెళ్లకుండా రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం పెంచాలని సూచించారు. సమావేశంలో క్యాబినెట్ కార్యదర్శి డాక్టర్ టి.వి. సోమనాథన్ పరిస్థితిపై సమగ్ర నివేదికను సమర్పించగా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, గృహ మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి జైశంకర్ తదితరులు పాల్గొన్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!